మహారాణిపేట: జనగణన–2027 జిల్లా స్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మొదటి దశ ‘గృహాల జాబితా – గృహ వసతుల గణన’కు సంబంధించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. బ్లాక్‌ల ఏర్పాటు, మ్యాపుల్లో గ్రామ సరిహద్దుల నిర్ణయం, జనాభా అంచనా విధానం వంటి అంశాలను అధికారులు సమగ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ స్ఫూర్తితో పని చేసి జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాధరి, జిల్లా అటవీ అధికారి రవీంద్ర ధామ, జనగణన జేడీ దయాసాగర్, ఇన్‌చార్జి డీఆర్‌వో శేషశైలజ, సీపీవో శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్


