సింహాచలం : ఏటా జరిగే చందనోత్సవంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు సేవలందించే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో గురువారం దేవస్థానం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు, బిస్కెట్లు, పళ్లు తదితరాలను అందిస్తూ స్వచ్ఛంద సంస్థలు విశేష సేవ చేస్తున్నాయని కొనియాడారు. ఈ ఏడాది కూడా వారి సేవలను సమన్వయంతో వినియోగించుకుంటామని తెలిపారు. అలాగే ఈనెల 29న జరగనున్న వార్షిక కల్యాణోత్సవం, ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవ ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో సూచించారు. సమావేశంలో పోలీస్, జీవీఎంసీ, ఫైర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


