మహారాణిపేట: వ్యర్థాలు ఏరుతూ మన పరిసరాలను శుభ్రపరిచే మహిళా కార్మికుల సేవలు అమూల్యమైనవని కలెక్టర్ హరేందిరప్రసాద్ కొనియాడారు. సోమవారం దళిత బహుజన్ రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో చెత్త ఏరుకునే మహిళా కార్మికుల గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ 48 మంది మహిళా కార్మికులకు అల్యూమినియం వంటపాత్రలు, చీపుర్లు, ప్లాస్టిక్ సామగ్రి అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలోని రెవెన్యూ గెస్టు హౌస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెత్త ఏరుకునే మహిళల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దళిత బహుజన్ రీసోర్స్ సెంటర్ సేవలను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ అనిల్ కుమార్, సభ్యులు నిఖిల, అజయ్, గురునాథ్, ధనలక్ష్మి, వివిధ కాలనీల కమ్యూనిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


