ఆసియాటిక్ సింహం
బీచ్‌రోడ్డు: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో కొత్త జంతువులు సందడి చేయనున్నాయి. విశాఖ జూ, గౌహతిలోని అసోం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ మధ్య జంతు మార్పిడి కార్యక్రమం గురువారం విజయవంతంగా జరిగింది. ఇందులో భాగంగా హిమాలయన్ బ్లాక్ బేర్, బ్లాక్ పాంథర్, చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏషియన్ పామ్ సివెట్‌లను గౌహతి నుంచి విశాఖకు తీసుకువచ్చారు. బదులుగా విశాఖ జూ నుంచి రింగ్ టెయిల్డ్ లీమూర్, స్టంప్ టెయిల్డ్ మకాక్, జంగిల్ క్యాట్, గ్రీన్ ఇగ్వానా, స్ట్రైప్డ్ హైనా జంతువులను అసోం స్టేట్ జూకు పంపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత విశాఖ జూలో మెలనిస్టిక్ చిరుత(బ్లాక్ పాంథర్) సందడి చేయనుంది. నలుపు రంగు, శక్తివంతమైన ఆకృతితో ఉండే బ్లాక్ పాంథర్ వన్యప్రాణి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ జూకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం ఈ కొత్త జంతువులన్నింటినీ జూ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచారు. ఆ గడువు పూర్తయిన తర్వాత వాటిని ప్రత్యేక ఎన్‌క్లోజర్లలోకి మార్చి సందర్శకుల వీక్షణకు అనుమతించనున్నారు.


