ఏయూక్యాంపస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికలు, యువతులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు తెలిపారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొమ్మాది నవోదయ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో ఆదివారం 8 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్–13, అండర్–18, 18 ఏళ్లు పైబడిన వారికి 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తామన్నారు. యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఫన్ గేమ్స్ కూడా ఉంటాయన్నారు. మహిళలను, యువతులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అస్మిత అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఖేలో ఇండియా పథకం మహిళా సాధికారతకు గొప్ప వేదికగా నిలిచిందన్నారు.


