మద్దిలపాలెం: లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత, ప్రముఖ గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న సన్మాన సభ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అట్టహాసంగా జరిగింది. బహుభాషా కోవిదుడిగా, శతాధిక గ్రంథకర్తగా పేరుగాంచిన సిమ్మన్న అనితర సాధ్యమైన ప్రతిభావంతులని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, మేధావులు పాల్గొని సిమ్మన్న దంపతులను గజమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ సిమ్మన్న సాహిత్య సేవ అనిర్వచనీయమని, ఆయన రాసిన పుస్తకాలు నేడు పరిశోధక విద్యార్థులకు దిక్సూచిలా మారి అత్యధిక ఫెలోషిప్‌లు సాధించేందుకు దోహదపడుతున్నాయని ప్రశంసించారు. సభాధ్యక్షుడు జర్ర అప్పారావు మాట్లాడుతూ వందకు పైగా గ్రంథాలను రచించడం సామాన్య విషయం కాదని, అది ఆయన ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆచార్య ధనరాజ్ సిమ్మన్నను ‘నడిచే గ్రంథాలయం’గా అభివర్ణించగా, ఆచార్య బెన్నీ ఆయన కఠోర శ్రమను, సాహిత్య త్యాగాన్ని కొనియాడారు. పరిశోధన స్థాయి నుంచే ఆయన అందరితో సోదర భావంతో మెలిగేవారని ఆచార్య గజ్జా యోహాను బాబు గుర్తుచేసుకోగా, తమకు సిమ్మన్న..ఒక మార్గదర్శి అని ఆచార్య ప్రేమానందం తెలిపారు. పరిశోధక విద్యార్థి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ఆచార్య సిమ్మన్న క్రమశిక్షణ, ఆయన సహధర్మచారిణి కృషి వల్లే ఈ అద్భుత సాహితీ ప్రయాణం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు సాల్మన్ బెన్నీ, నల్లా సత్యనారాయణ, అరుణ్ కుమార్, తెలుగు దండు అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరితో పాటు పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నీరాజనాలు అర్పించారు.


