నేటి నుంచి విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ జోష్
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం : నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు సెలబ్రిటీ టీ20 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలోని జట్లతో పాటు ఎమ్మెల్యేలు, పోలీస్, కార్పొరేట్ విభాగాలకు చెందిన మొత్తం ఏడు జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. సుమారు 110 మంది సినీ, టీవీ ఆర్టిస్టులు ఈ పోటీల కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. క్రీడల్లో రాణిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తోడ్పాటునందించే సామాజిక లక్ష్యంతో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు నటుడు శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా, మార్చి 1వ తేదీ రాత్రి టైటిల్ పోరు జరగనుంది.


