మళ్లీ కలుద్దాం! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కలుద్దాం!

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

మళ్లీ

మళ్లీ కలుద్దాం!

ముగిసిన ఐఎఫ్‌ఆర్‌–2026,

మిలాన్‌ విన్యాసాలు

విశాఖ నుంచి పయనమవుతున్న

విదేశీ నౌకలు, ప్రతినిధులు

ఆత్మీయ వీడ్కోలు పలికిన

భారత నౌకాదళం

2028లో మిలాన్‌కు

మళ్లీ విశాఖే వేదిక అయ్యే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరాన రెండు వారాలపాటు సాగిన నౌకల సందడి ముగిసింది. అంతర్జాతీయ సముద్ర శక్తుల సమాగమంగా నిలిచిన ఐఎఫ్‌ఆర్‌–2026, మిలాన్‌–2026, అయాన్స్‌ నేవీ చీఫ్స్‌ కాంక్లేవ్‌ విజయవంతంగా పూర్తయ్యాయి. యుద్ధ నౌకల హోరాహోరీ విన్యాసాలు, విదేశీ ప్రతినిధుల రాకపోకలు, సాంస్కృతిక వేడుకలతో కళకళలాడిన తీరనగరం ఇప్పుడు ఆత్మీయ వీడ్కోలతో నిండిపోయింది. ‘మళ్లీ 2028లో కలుద్దాం’ అంటూ మిత్ర దేశాలు విశాఖకు బైబై చెబుతున్నాయి.

అంతర్జాతీయ వేదికపై నౌకాదళ శక్తి

ఈ నెల 15 నుంచి బుధవారం వరకు జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ–2026, మిలాన్‌–2026, ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం (అయాన్స్‌), నేవీ చీఫ్స్‌ కాంక్లేవ్‌లకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల ప్రతినిధులు, యుద్ధ నౌకలు పాల్గొన్న ఈ విన్యాసాలు భారత నౌకాదళ దౌత్య వ్యూహాన్ని చాటిచెప్పాయి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంతో పాటు హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సమాచార మార్పిడి, ఉమ్మడి రక్షణ వ్యూహాలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా సముద్రపు దొంగల నిరోధం, విపత్తు నిర్వహణపై ప్రయోగాత్మక ప్రదర్శనలు భక్తులను, అతిథులను ఆకట్టుకున్నాయి.

2028లోనూ విశాఖే వేదిక?

మిలాన్‌–2026 విజయవంతంగా ముగియడంతో, 2028లో జరగనున్న తదుపరి మిలాన్‌ విన్యాసాలకు కూడా విశాఖపట్నమే వేదిక అయ్యే అవకాశాలు ఉన్నట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. సముద్ర తీర భౌగోళిక అనుకూలత, సమృద్ధమైన మౌలిక వసతులు ఈ నిర్ణయానికి బలంగా నిలుస్తున్నాయి.

విశాఖ ఆతిథ్యానికి ప్రశంసలు

విన్యాసాలు ముగియడంతో జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలకు చెందిన నౌకలు ఇప్పటికే బయలుదేరాయి. రష్యా, వియత్నాం మరియు ఇతర ఆగ్నేయాసియా దేశాల నౌకలు నేడు, రేపు పయనమయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రతినిధులు స్వదేశాలకు తిరుగు ప్రయాణం అవుతున్న వేళ, భారత నౌకాదళం వారికి ఆత్మీయ వీడ్కోలు పలికింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. మూడు అంతర్జాతీయ కార్యక్రమాలను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించి ‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’గా పేరుగాంచిన విశాఖపట్నం మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది.

ఈ ప్రయాణం అద్భుతం

భారత్‌తో ప్రయాణం అద్భుత అనుభవాన్ని ఇచ్చింది. విశాఖ అందించిన ఆతిథ్యం ఊహించని రీతిలో ఉంది. రక్షణ రంగంలో ముఖ్యంగా నౌకాదళ రంగంలో సాంకేతికత మార్పిడిలో, సముద్ర భద్రతలో భారత్‌ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయం. క్వాడ్‌ దేశాల మధ్య బంధాన్ని బలపరచడంలో ఇలాంటి విన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయి.

– వైస్‌ అడ్మిరల్‌ కునిమి యశుహిరో,

జపాన్‌ మారీటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌

వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌

మిత్రదేశాల మధ్య శాశ్వత బంధాలకు ప్రతీక

సాహసం, సహకారం, సమన్వయం అనే థీమ్‌తో నిర్వహించిన మిలాన్‌ విజయవంతమైంది. హిందూ మహాసముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రతపై అయాన్స్‌ వేదికగా ఫలప్రదమైన చర్చలు జరిగాయి. సురక్షితమైన వ్యవస్థల్ని శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు నౌకాదళాల భాగస్వామ్య నిబద్ధతకు నిదర్శనంగా విశాఖ నిలిచింది.

– రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద,

ఈఎన్‌సీ కమాండింగ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌

సముద్ర స్నేహానికి ఘన వీడ్కోలు

మళ్లీ కలుద్దాం!1
1/2

మళ్లీ కలుద్దాం!

మళ్లీ కలుద్దాం!2
2/2

మళ్లీ కలుద్దాం!

Advertisement
 
Advertisement
Advertisement