డాబాగార్డెన్స్: వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం డ్రైవర్లు సమ్మెకు దిగారు. వాహనాల బీమా, ఫిట్‌నెస్ గడువు ముగిసినా అధికారులు స్పందించకపోవడంతో ఈ ఆందోళన చేపట్టినట్లు యూనియన్ అధ్యక్షుడు పడాల రమణ తెలిపారు. ఇటీవల గాజువాక జోన్‌లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆ ఘటనకు అవుట్‌సోర్సింగ్ డ్రైవర్ సతీష్‌ను బాధ్యుడిని చేస్తూ డీఈ సునీల్, వెహికల్ ఇన్‌చార్జ్ సాయిబాబా వేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని జోన్ల డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో అదనపు కమిషనర్ నల్లనయ్య, సీఎంవోహెచ్ డాక్టర్ నరేష్ కుమార్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే చర్చలు సానుకూలంగా సాగకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు పడాల రమణ, కె.సత్యనారాయణ తదితరులు హెచ్చరించారు.
అధికారుల తీరుపై ఏఐటీయూసీ ఆగ్రహం


