తీర్థయాత్రలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు! | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు!

Mar 6 2026 8:02 AM | Updated on Mar 6 2026 8:02 AM

అల్లిపురం: తీర్థయాత్రలకు వెళ్లిన వారి ఇంటికి కన్నం వేసి, విలువైన బంగారం, వెండి వస్తువులను అపహరించిన ఓ మహిళ సహా ముగ్గురు నిందితులను పీఎం పాలెం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 29 తులాల బంగారు, 101 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. గురువారం క్రైం డీసీపీ లతామాధురి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కొమ్మాది జంక్షన్‌, వివేకానంద కాలనీ, అయ్యప్పనగర్‌కు చెందిన రిటైర్డ్‌ విద్యుత్‌ లైన్‌మన్‌ బొడ్డేటి అప్పలరాజు ఫిబ్రవరి 2న తన కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.8 లక్షల విలువైన 29 తులాల బంగారు, 101 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు క్రైం సీఐ బి.ప్రకాష్‌, ఎస్‌ సూర్యప్రకాష్‌ రావు తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాధితులు, ఇరుగుపొరుగు వారి కాల్‌ డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో బాధితుడితో పరిచయం ఉన్న పెనుగుర్తి శ్రీదేవి కాల్‌ డేటా అనుమానాస్పదంగా ఉండటంతో ఆమైపె దృష్టి సారించారు. ఆమె తరచుగా ఫోన్‌ నంబర్లు మారుస్తూ.. దొంగతనానికి ముందు, ఆ తర్వాత కోడూరు ప్రసాద్‌బాబు అనే వ్యక్తితో పలుమార్లు మాట్లాడినట్లు గుర్తించారు. చోరీ జరిగినప్పటి నుంచి ప్రసాద్‌ బాబు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయినట్లు తేలింది. దీంతో శ్రీదేవి, ప్రసాద్‌ల గురించి ఆరా తీయగా వారు పరారీలో ఉన్నట్లు స్పష్టమైంది. వారి కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాల సమాచారం మేరకు నిందితులు ఈ నెల 3న ఎంవీవీ సిటీ నుంచి పనోరమ రోడ్డు మధ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం పనోరమ హిల్స్‌ రోడ్డులో వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చోరీకి గురైన సొత్తు మొత్తాన్ని రికవరీ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

కాల్‌ డేటా విశ్లేషణతో పట్టుబడిన నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement