కనీస వేతనాల సవరణపై విస్తృత చర్చ | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనాల సవరణపై విస్తృత చర్చ

Mar 6 2026 8:02 AM | Updated on Mar 6 2026 8:02 AM

సీతంపేట: షెడ్యూల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్స్‌కు సంబంధించి కనీస వేతనాల సవరణపై రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌ పి.శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో నగరంలోని ఓ హోటల్‌లో గురువారం సమావేశం జరిగింది. కనీస వేతనాల సవరణకు సంబంధించి యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్‌ కోడ్స్‌, జీతభత్యాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో.. కార్మికుల జీవనానికి సరిపడా కనీస వేతనాలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తాలు చిన్న పరిశ్రమలు భరించలేని స్థాయిలో ఉన్నాయని యాజమాన్యాలు పేర్కొన్నాయి. దీనిపై కార్మిక సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ.. పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించడానికి, చట్టాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఇన్స్‌పెక్టింగ్‌ ఆఫీసర్లకు స్వేచ్ఛగా, విస్తృతంగా తనిఖీలు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు. పరిశ్రమల్లోని లోపాలను గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు, ప్రతిపాదనలను సలహా మండలి సభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చైర్మన్‌ పి.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎం.రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, దాల్‌ మిల్స్‌ అసోసియేషన్‌, గోల్డ్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌, జేఎన్‌పీసీ మర్చెంట్స్‌ అసోసియేషన్‌, ఫార్మా అసోసియేషన్‌ ప్రతినిధులతో పాటు.. ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement