చేతికంది ఎన్నాళ్లయిందో...! | - | Sakshi
Sakshi News home page

చేతికంది ఎన్నాళ్లయిందో...!

Mar 3 2026 7:17 AM | Updated on Mar 3 2026 7:17 AM

మూన్నాళ్ల ముచ్చటగా

రాగిపిండి పంపిణీ

పప్పన్నం రుచి చూసి ఎన్నాళ్లయిందో..

రేషన్‌ షాపుల్లో సరకుల కోతపై

పేదల ఆగ్రహం

అటకెక్కిన చంద్రబాబు హామీ

మహారాణిపేట: జిల్లాలో పేద ప్రజలకు అందే ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులపై చంద్రబాబు ప్రభుత్వం కత్తెర కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో రేషన్‌ డిపోల ద్వారా అనేక రకాల నిత్యావసరాలు అందిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. 22 నెలల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే కందిపప్పు అందించి, ప్రస్తుతం దానికి పూర్తిస్థాయిలో స్వస్తి పలికారు. ఫలితంగా నిరుపేదలు పప్పు అన్నానికి నోచుకోని దైన్యం నెలకొంది. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తోంది తప్ప, హామీ ఇచ్చిన విధంగా కందిపప్పు, రాగిపిండి, వంటనూనె వంటి సరుకుల ఊసే ఎత్తడం లేదు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో

క్రమం తప్పకుండా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేది. డీలర్లకు 69 రూపాయలకు ఇచ్చి, కార్డుదారులకు 70 రూపాయలకు పంపిణీ చేసే ఈ విధానం వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరిగేది. మార్కెట్‌లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, రేషన్‌ షాపులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో మార్కెట్‌లో భారీ ధరలకు కొనుగోలు చేయలేక సతమతమవుతున్నారు. విశాఖ అర్బన్‌ డీఎస్‌వో పరిధిలోని మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి వంటి ప్రాంతాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న 5,17,619 తెలుపు కార్డుదారులు ఈ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.

రాగిపిండిరాదు..గోధుమ పిండి

అంతంత మాత్రమే..

మరోవైపు రాగిపిండి సరఫరా కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రస్తుతం అందిస్తున్న అరకొర గోధుమ పిండి పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే గోధుమ పిండిని పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత కార్డుదారులకు మొండిచేయి చూపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 625 చౌకధరల డిపోలు, ఒక జిల్లా సప్లయి అధికారి ఆధ్వర్యంలో భారీ యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ, నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత లోపించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చి, తక్షణమే అన్ని రకాల సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా అందజేయాలని సామాన్య ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement