ప్రపంచ వేదికపై విశాఖ ఘనత | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ వేదికపై విశాఖ ఘనత

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

ప్రపంచ వేదికపై విశాఖ ఘనత

ప్రపంచ వేదికపై విశాఖ ఘనత

జీవీఎంసీకి మిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ గ్రాంట్‌

డాబాగార్డెన్స్‌: వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ చేపట్టిన చర్యలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక ‘బ్లూమ్‌బర్గ్‌ ఫిలాంత్రోపీస్‌’ నిర్వహించిన 2025–2026 మేయర్స్‌ చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో నగరానికి మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల గ్లోబల్‌ గ్రాంట్‌తో పాటు సాంకేతిక, కార్యాచరణ సహాయం అందనుందని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ..‘వి–పుల్‌’ ప్రాజెక్టు ఒక మోడల్‌గా నిలిచిందన్నారు. వరదలు, తుపానులు, తీవ్ర ఉష్ణ తరంగాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విశాఖ నగరం వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించిందని చెప్పారు. ‘విజాగ్‌–ప్రజాముఖి అర్బన్‌ లివింగ్‌ ల్యాబ్‌ (వి–పుల్‌)’ పేరిట అమలవుతున్న ఈ కార్యక్రమం.. ప్రజాకేంద్రీకృత విధానం, వాతావరణ ప్రతిఘటన సామర్థ్యం, హైపర్‌–లోకల్‌ కమ్యూనిటీ భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 630కి పైగా దరఖాస్తుల్లో విశాఖపట్నం ప్రత్యేక ప్రతిభ కనబరిచి ఈ విజయాన్ని సాధించిందని కమిషనర్‌ పేర్కొన్నారు. ‘ప్రారంభ దశలో టాప్‌–50 ఫైనలిస్టులలో స్థానం సంపాదించిన జీవీఎంసీకి 50,000 అమెరికన్‌ డాలర్ల సీడ్‌ ఫండింగ్‌, సాంకేతిక సహాయం లభించింది. ఆ సహాయంతో స్థానిక స్థాయిలో పైలట్‌ ప్రాజెక్టును అమలు చేశాం. ఈ పైలట్‌ దశలో వార్డు స్థాయి కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి, హైపర్‌–లోకల్‌ సెన్సింగ్‌ వ్యవస్థలు, డేటా ఆధారిత నిర్ణయ సాధనాలను పరీక్షించాం’ అని ఆయన వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో వాతావరణ ప్రతిఘటన, విపత్తు సంసిద్ధత చర్యలను అమలు చేయడంతో పాటు పౌరులు, మున్సిపల్‌ విభాగాల మధ్య సమర్థవంతమైన ఫీడ్‌బ్యాక్‌ వ్యవస్థను నెలకొల్పామని కమిషనర్‌ తెలిపారు. నగర పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకున్న ఈ వినూత్న చర్యలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement