మహారాణిపేట: విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం జిల్లాలో కీలకమైన రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను నియమించడంలో మాత్రం జాప్యం చేస్తోంది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వంటి కీలక పోస్టులు దాదాపు 165 రోజులుగా ఖాళీగానే ఉండటంతో రెవెన్యూ పరిపాలన ఇన్‌చార్జిల ఆధారంగానే కొనసాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీఓ పి.శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించకపోవడం గమనార్హం. దీంతో కీలక రెవెన్యూ వ్యవహారాలు ఇన్‌చార్జి అధికారుల ద్వారానే సాగుతున్నాయి. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీఆర్వోగా పనిచేసిన జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) సత్తిబాబు గురువారం రిలీవ్ అయ్యారు. ఆయన విజయనగరం డీఆర్వోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కలెక్టరేట్‌లోని కెఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజను ఇన్‌చార్జి డీఆర్వోగా నియమించారు. అలాగే విశాఖ ఆర్డీవోగా హెచ్‌పీసీఎల్ భూసేకరణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. డీఆర్వో–ఆర్డీవోల మధ్య అవినీతి ఆరోపణల వివాదం నేపథ్యంలో ప్రభుత్వం వారిని బదిలీ చేసినప్పటికీ, అనంతరం కొత్త నియామకాలు జరగకపోవడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో భూములు, భూసేకరణ, పరిపాలన వంటి కీలక వ్యవహారాలను చూసే ప్రధాన పోస్టులు దీర్ఘకాలంగా ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. కీలక బాధ్యతలున్న ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, లేదంటే రెవెన్యూ పరిపాలనలో ఆలస్యం, అనిశ్చితి మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వర్గాలు అంటున్నాయి.


