స్వయంకృషితోనే సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

స్వయంకృషితోనే సక్సెస్‌

Mar 4 2026 7:14 AM | Updated on Mar 4 2026 7:14 AM

తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–2 సాధించిన భవాని ఉద్యోగం చేస్తూనే ఉన్నత లక్ష్యం వైపు.. కోచింగ్‌ లేకుండా సత్తా చాటిన సామాన్యురాలు

మద్దిలపాలెం: సమాజానికి సేవ చేయాలన్న ఉన్నతమైన ఆశయం.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సడలని ఆత్మవిశ్వాసం.. వెరసి ఆమెను విజయతీరాలకు చేర్చాయి. ఎలాంటి కోచింగ్‌ లేకుండా, ఒకవైపు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూనే, కేవలం ఆన్‌లైన్‌ వనరుల సాయంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–2 సాధించి డిప్యూటీ ఎంపీడీవోగా ఎంపికై ంది పాండ్రంకి భవాని. ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భవాని స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమె మాటల్లోనే...

చిరుద్యోగి కుటుంబం నుంచి..

మా స్వస్థలం విజయనగరం జిల్లా జయతి గ్రామం. మాది ఒక చిన్న రైతు కుటుంబం. మా చదువుల కోసం మా తల్లిదండ్రులు విశాఖపట్నం వలస వచ్చారు. మా నాన్న పాండ్రంకి చిన్న అప్పల నాయుడు నగరంలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ భారతి గృహిణి. వచ్చే అరకొర ఆదాయంతోనే ఎన్నో కష్టాలకోర్చి నాతో పాటు తమ్ముడిని మంచి చదువులు చదివించారు.

చదువులో ఎప్పుడూ ముందే..

ఒకటి నుంచి పదో తరగతి వరకు నగరంలోని శ్రీ శారద విద్యా నిలయంలో చదివాను. 2016లో 10వ తరగతిలో 10/10 పాయింట్లు సాధించాను. ఇంటర్‌లో 1000కి 990 మార్కులు తెచ్చుకుని, ఎంసెట్‌ ద్వారా ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) సీటు సాధించాను. 2022లో 89 శాతం మార్కులతో బీటెక్‌ పూర్తి చేశాను. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కాగ్నిజెంట్‌, టీసీఎస్‌ వంటి బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి.

సమయపాలనే నా ఆయుధం

ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేదాన్ని. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, సివిల్స్‌ లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. గైడెన్స్‌ ఇచ్చేవారు లేకపోవడంతో ఆన్‌లైన్‌ వనరులనే గురువుగా మలచుకున్నాను. ఉదయం 8 గంటలకే లైబ్రరీకి వెళ్లి, అక్కడే ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ విధులు నిర్వర్తిస్తూనే మిగిలిన సమయంలో చదువుకునేదాన్ని. ఇంటికి వచ్చాక రాత్రి 12 గంటల వరకు ప్రిపరేషన్‌ సాగేది. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టేది కాదు. ఆ సమయాన్ని కూడా చదువుకే కేటాయించేదాన్ని.

తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–2 విజయం

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న సమయంలోనే గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ వచ్చింది. పక్కా ప్రణాళికతో చదివాను. 2026 జనవరిలో విడుదలైన ఫలితాల్లో.. ఎలాంటి కోచింగ్‌ లేకుండా తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ ఎంపీడీవో పోస్టు సాధించాను. మా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తిని నేనే కావడం, మా అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడటం నాకెంతో తృప్తినిచ్చింది.

లక్ష్యం ఐఏఎస్‌..

ప్రజలకు సేవ చేసి, నా వల్ల కనీసం ఒక కుటుంబానికై నా మేలు జరగాలన్నదే నా ఆకాంక్ష. 2024లో సివిల్స్‌ తొలి ప్రయత్నంలో విఫలమైనా నిరాశపడలేదు. ప్రస్తుతం సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నాను. ఎలాగైనా సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావాలన్నదే నా తుది లక్ష్యం.

కుటుంబ బాధ్యత.. సివిల్స్‌ కల..

చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. ఒక రోజు పత్రికలో సివిల్స్‌ విజేతల గురించి చదివినప్పుడు నాలోనూ ఐఏఎస్‌ కావాలన్న ఆశయం ఏర్పడింది. బీటెక్‌ చదువుతున్నప్పుడు టాపర్స్‌ గురించి, వాళ్లు చదివిన విధానం, చదివే పుస్తకాల గురించి ఆన్‌లైన్‌లో చూస్తూ నాకంటూ ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ, మా ఇల్లు నాన్న ఒక్కరి సంపాదన మీదే నడుస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కోచింగ్‌ తీసుకునే స్థోమత లేకపోవడంతో, కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో 2023లో కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement