మేయర్ ఇంట మోకరిల్లిన జీవీఎంసీ
‘ఈవెంట్ మేనేజర్’ అవతారమెత్తిన యంత్రాంగం నగర సేవలు పక్కనపెట్టి.. పీలా కుమారుడి పెళ్లిలో హడావుడి
పెందుర్తి : నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగంం మేయర్ వ్యక్తిగత కార్యక్రమంలో తలమునకలైన ఘటన వివాదాస్పదమైంది. ప్రజాసేవకు కట్టుబడి ఉండాల్సిన సంస్థ, ప్రజాధనంతో మేయర్ పీలా శ్రీనివాసరావు ఇంట పెళ్లికి ‘బ్యాండ్ బాజా’ కొట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీలా కుమారుడి వివాహం సందర్భంగా పెందుర్తిలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గత పక్షం రోజులుగా జీవీఎంసీ సిబ్బంది విస్తృతంగా పనిచేసినట్లు సమాచారం. పెళ్లి రోజున సాయంత్రం కురిసిన వర్షంతో అలంకరణలు చెదిరిపోవడంతో, వాటిని సరిచేయడానికి జీవీఎంసీ యంత్రాంగం మరింతగా రంగంలోకి దిగింది. నగరంలో వివిధ పనులకు వినియోగించే జేసీబీలు, ఇతర వాహనాలు వేదిక వద్దకు తరలించి మరమ్మతులు, శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు తెలిసింది. ఈ పనులను జీవీఎంసీ ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఒక ప్రైవేట్ కుటుంబ కార్యక్రమంలో నిమగ్నమవడం పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రజల సొమ్ముతో నడిచే సంస్థ వనరులను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు నగర ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి. నగరంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్న వేళం ప్రజాసేవకు వినియోగించాల్సిన యంత్రాలు, సిబ్బంది ఒక వ్యక్తిగత వేడుకకు మళ్లించడంపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాధన వినియోగంపై పారదర్శకత, బాధ్యత అవసరమని కోరుతున్నాయి.


