రోజులేనా..! | - | Sakshi
Sakshi News home page

రోజులేనా..!

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

రోజులేనా..!

రోజులేనా..!

మళ్లీ పాత

డాబాగార్డెన్స్‌: జీవీంఎసీ ప్రస్తుత పాలకవర్గ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. 2021లో మొదలైన ఈ ఐదేళ్ల ప్రయాణంలో శనివారం నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం అత్యంత కీలకం కానుంది. ప్రస్తుత మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో ఈ చిట్టచివరి సమావేశం జరగనుంది. ఈ భేటీలో నగరాభివృద్ధికి సంబంధించి 37 ప్రధాన అజెండా అంశాలపై చర్చించి సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ, వివిధ సర్వీసు అంశాలు మరియు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు ఈ సమావేశంలో మోక్షం లభించనుంది.

ఇద్దరు మేయర్లు...

ఎన్నో రాజకీయ మలుపులు

ఈ ఐదేళ్ల కాల పరిమితిలో విశాఖ నగర పాలన ఎన్నో రాజకీయ పరిణామాలకు వేదికై ంది. 2021 ఏప్రిల్‌ నుంచి సుమారు నాలుగేళ్ల పాటు వైఎస్సార్‌ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌ హోదాలో కౌన్సిల్‌ సమావేశాలను నడిపించారు. ఆమె హయాంలో జియ్యాని శ్రీధర్‌, కట్టుమూరి సతీష్‌ డిప్యూటీ మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాజకీయ సమీకరణల మార్పుతో గతేడాది ఏప్రిల్‌ 28న పీలా శ్రీనివాసరావు మేయర్‌గా, దళ్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్‌గా పగ్గాలు చేపట్టారు. కట్టుమూరి సతీష్‌ మాత్రం ఐదేళ్ల పాటు డిప్యూటీ మేయర్‌గా తన పదవిలో కొనసాగడం గమనార్హం. వచ్చే నెల 18తో ఈ పాలకవర్గ గడువు అధికారికంగా ముగియనుంది.

పంచాయతీల విలీనం..

ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత

ప్రస్తుత పరిస్థితుల్లో జీవీఎంసీకి తక్షణమే ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ విలీన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైతే, వార్డుల పునర్విభజన, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా, మార్చి 7వ తేదీ తర్వాత కౌన్సిల్‌ సమావేశాలకు అవకాశం లేకపోవడంతో, నగరం మరోసారి సుదీర్ఘ కాలం పాటు అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మేయర్ల చారిత్రక నేపథ్యం

విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో ఎందరో ప్రముఖులు మేయర్లుగా సేవలు అందించారు. 1981లో బీజేపీకి చెందిన ఎన్‌.ఎస్‌.ఎన్‌ రెడ్డి తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టగా, ఆ తర్వాత డి.వి. సుబ్బారావు (టీడీపీ), సబ్బం హరి (కాంగ్రెస్‌) వంటి నేతలు పనిచేశారు. విశాఖకు తొలి మహిళా మేయర్‌గా రాజాన రమణి ఐదేళ్ల పాటు రికార్డు సృష్టించారు. గ్రేటర్‌ విశాఖగా ఆవిర్భవించిన తర్వాత పులుసు జనార్దనరావు మేయర్‌గా సేవలందించగా, సుదీర్ఘ విరామం తర్వాత 2021లో గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పీలా శ్రీనివాసరావు ఈ ఐదేళ్ల కాలక్రమానికి ముగింపు పలకబోతున్నారు.

ఎన్నికల సందిగ్ధంలో గ్రేటర్‌ విశాఖ జీవీఎంసీ ‘చివరి’ అంకం: ఐదేళ్ల ప్రస్థానానికి నేడే ముగింపు పలకనున్న కౌన్సిల్‌ 37 అంశాలతో అజెండా మేయర్‌ కాలానికి మోగిన ముగింపు గంట

మళ్లీ అధికారుల పాలన? విశాఖలో ఉత్కంఠ

ప్రస్తుత పాలకవర్గ గడువు ముగియడానికి మరో పక్షం రోజులు మాత్రమే సమయం ఉండటంతో, నగరం మళ్లీ అధికారుల పాలనలోకి వెళ్తుందా అనే చర్చ జోరందుకుంది. గత చరిత్రను పరిశీలిస్తే..2012 నుంచి 2021 వరకు సుమారు ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలు జరగక అధికారులే పాలన సాగించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సుదీర్ఘ కాలం పాటు ప్రత్యేకాధికారుల పరిపాలన కొనసాగింది. 2021లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో మళ్లీ ప్రజాప్రతినిధుల పాలన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం, పాలకవర్గ గడువు ముగిసిపోతుండటంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయేమోనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement