మహారాణిపేట: భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన ప్రతిష్టాత్మక ‘వన్ ఇండియా రన్’ సోమవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన పరుగు లక్ష్యాలను వివరించారు. యువతలో స్ఫూర్తి నింపడం, సామాజిక సేవపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 5,000 కిలోమీటర్ల మేర ఈ పరుగు సాగుతోందని ఆయన తెలిపారు. భారతదేశ తూర్పు తీరం వెంబడి సుదీర్ఘ పరుగు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలవడమే కాకుండా ‘ఉదయాన్ ఫౌండేషన్’ కోసం రూ. 60 లక్షల నిధులు సేకరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఓం సతీజా పేర్కొన్నారు. ఈ నిధులను అట్టడుగు వర్గాలకు చెందిన వారు, కుష్టు వ్యాధి ప్రభావిత కుటుంబాల పిల్లల విద్యావసరాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 32 రోజుల్లో 1,520 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించానని, ప్రతిరోజూ సుమారు 50 కిలోమీటర్ల మేర పరుగెడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 20 లక్షల మేర నిధులు సమకూరాయని, ఈ పరుగు ద్వారా ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


