ఇసుక తోడేళ్లు | - | Sakshi
Sakshi News home page

ఇసుక తోడేళ్లు

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

ఇసుక

ఇసుక తోడేళ్లు

● యథేచ్ఛగా నల్ల ఇసుక తరలింపు ● రాత్రి పడితే చాలు.. తీరంలో ట్రాక్టర్ల మోతే.. ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు

తీరంలో

తగరపువలస: భీమిలి మండలం అన్నవరం తీరప్రాంతం నుంచి అక్రమ వ్యాపారులు విలువైన నల్ల ఇసుకను తెలంగాణ, తదితర పక్క రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఈ ఇసుక మాఫియాకు భీమిలి ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ, జనసేన నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చీకటి పడితే చాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తీరంలో వాలిపోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ, ప్రతిపాదిత దశలో ఉన్న ఒబెరాయ్‌, మై ఫెయిర్‌ హోటళ్ల వైపు.. మెట్టల మీదుగా రాకపోకలకు వీలుగా అక్రమార్కులు మార్గాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి అన్నవరం హయగ్రీవ రిసార్ట్స్‌, మాన్సాస్‌ కొబ్బరితోటల్లో నిలిపి, భారీ లారీల్లో లోడ్‌ చేసి ఎప్పటికప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పంపించేస్తున్నారు.

గ్రామస్తుల్లో భయాందోళన

తీరం నుంచి తరలించుకుపోతున్న ఇసుక రవాణా కారణంగా.. తుపాను సమయంలో తమ గ్రామాలు ముంపునకు గురవుతాయని అన్నవరంతో పాటు భోగాపురం మండలం తూడెం పంచాయతీ వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ ఇసుక రవాణా వెనుక బలమైన మాఫియా ఉండటంతో.. వారిని అడ్డుకోవాలన్నా, కనీసం నోరు మెదపాలన్నా ఈ ప్రాంత మత్స్యకారులు, యాదవ సామాజిక వర్గాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 24 టైర్లు కలిగిన భారీ లారీ ఇసుక అన్నవరం వద్దే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలిపోతున్నట్లు తెలిసినా రెండు మండలాల రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల అమాయకత్వం కారణంగా మిగిలిన తీరప్రాంతాలతో పోలిస్తే అన్నవరం, ఎర్రయ్యపాలెం, పైలపేట, గొల్లపేట, తూడెం, బసవపాలెం, దిబ్బడపాలెం తదితర తీరాల్లో సముద్రపు అలలు, వాటిని ఆనుకుని ఉన్న ఇసుక తిన్నెల మధ్య స్పష్టమైన అగాధం ఏర్పడుతోంది. దీంతో వేల ఏళ్లుగా ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలు(స్టాలగ్‌మైట్లు) తమ ఆకారాన్ని కోల్పోతున్నాయి.

నల్ల ఇసుకను ఎందుకు వినియోగిస్తారంటే...

సాధారణ ఇసుక కంటే భిన్నమైన లక్షణాలు, పది రెట్లు అధిక ధర కలిగి ఉండే ఈ నల్ల ఇసుకకు మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉంది. ఇందులో ఉండే ఖనిజాల వల్ల నేలకు పోషణ లభిస్తుంది. తేమను నిలిపి, విత్తనాల మొలక శాతాన్ని, నేల నాణ్యతను పెంచడానికి తోటపనుల్లో దీనిని వాడతారు. ముఖ్యంగా నల్ల పసుపు సాగులో దీని వినియోగం ఎక్కువ. కాంక్రీట్‌ మిశ్రమాలతో తయారయ్యే నిర్మాణాలు, ఇటుకలు, వంతెనలు, రోడ్ల తయారీలో వినియోగిస్తారు. ఆక్వేరియంలు, ల్యాండ్‌ స్కేపింగ్‌ అలంకరణలో నల్ల ఇసుకను ఉపయోగిస్తారు. ఇనుము తయారీ పరిశ్రమల్లో దీనిని విరివిగా వాడతారు. ఇందులో ఇనుము, అల్యూమినియం, టైటానియం వంటి ఖనిజాలు ఉండటంతో సాండ్‌బ్లాస్టింగ్‌ ప్రక్రియ ద్వారా ఆ ఖనిజాలను వెలికితీయడానికి ఉపయోగిస్తారు. సిలికాన్‌ చిప్స్‌, అద్దాల తయారీలోనూ ఈ రేణువులను వినియోగిస్తారు. వేడి చేసిన నల్ల ఇసుకను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నివారణకు ‘వేడి ఇసుక ప్యాక్‌’ గా ఉపయోగిస్తారు.

ఇసుక తోడేళ్లు1
1/1

ఇసుక తోడేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement