చందనోత్సవం ఏర్పాట్లలో జాప్యం వద్దు
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై సాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం క్యూలు, మంచినీటి వసతి, బారికేడ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల వేగంతో పాటు నాణ్యత విషయంలోనూ రాజీ పడకూడదని, ఎక్కడైనా అలసత్వం కనిపిస్తే సహించేది లేదని ఈవో హెచ్చరించారు. ఈఈలు రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి, ఏఈ రవిరాజు తదితరులు పాల్గొన్నారు.


