మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పరామర్శ
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు. ఆదివారం గుంటూరులోని అంబటి నివాసంలో కేకే రాజుతో పాటు సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే అంబటి రాంబాబును అక్రమంగా జైలుకు పంపించారని విమర్శించారు. అంతేకాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసి కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయ వేధింపులకు వైఎస్సార్ సీపీ ఏమాత్రం వెరవబోదని, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


