మధురవాడ జెడ్సీ అయ్యప్పనాయుడు
మధురవాడ: జీవీఎంసీ నిర్వహిస్తున్న ప్రత్యేక పన్నుల వసూలు డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం ఒక్క రోజే రూ. 2 కోట్లు వసూలైనట్లు మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు తెలిపారు. జోన్ పరిధిలోని 5, 6, 7, 8 వార్డుల్లో కొన్ని రోజులుగా ఎనిమిది బృందాలు ఈ వసూళ్ల ప్రక్రియను చేపడుతున్నాయి. మొండి బకాయిలు ఉన్న వారి ఆస్తులను సీజ్ చేయడం, కుళాయి కనెక్షన్లు కట్ చేయడం, నోటీసులు జారీ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఐటీ సెజ్‌లోని ఐలా కంపెనీ నుంచి రూ.1.10 కోట్లు, అవ్యాన్ డీలర్స్ నుంచి రూ. 65.10 లక్షలు పన్నుల రూపంలో వసూలు చేశారు. ఈ ఆస్తి పన్ను చెక్కులను జెడ్సీ అయ్యప్పనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ అచ్చంనాయుడు, ఆర్‌ఐ సుభాన్ తదితరులు కలిసి డీసీఆర్ ఎస్.శ్రీనివాస్‌కు అందజేశారు.


