మద్దిలపాలెం: బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం ప్లాటినమ్ జూబ్లీ బిల్డింగ్‌లో జరిగిన కోచ్‌లు, మేనేజర్ల సమావేశంలో ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 115 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 520 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. 60 కేజీల నుంచి 90 ప్లస్ కేజీల వరకు వివిధ విభాగాల్లో ఈ శరీర సౌష్టవ పోటీలు జరగనున్నాయి. క్రమశిక్షణతో క్రీడల్లో రాణించాలని, విజేతలకు ఈ నెల 4వ తేదీన మెడల్స్, ఛాంపియన్‌షిప్ ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐబీబీఎఫ్ ప్రతినిధులు డాక్టర్ రత్నాకర్, కె. గురునాథరావు, వివిధ వర్సిటీల మేనేజర్లు పాల్గొన్నారు.


