గ్రీన్‌బెల్ట్‌లో వ్యాపార సముదాయమా? | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌బెల్ట్‌లో వ్యాపార సముదాయమా?

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

గ్రీన్‌బెల్ట్‌లో వ్యాపార సముదాయమా?

గ్రీన్‌బెల్ట్‌లో వ్యాపార సముదాయమా?

● పావులు కదుపుతున్న జనసేన కార్పొరేటర్‌ ● 28న జీవీఎంసీ చివరి సర్వసభ్య సమావేశం

డాబాగార్డెన్స్‌: బీచ్‌రోడ్డులో సీఆర్‌జెడ్‌ నిబంధనలంటూ.. మద్దిలపాలెంలో హైకోర్టు ఉత్తర్వులంటూ.. నిబంధనలు, ఆదేశాల పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొడుతున్న జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌.. ఇప్పుడు ఏకంగా గ్రీన్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయం ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతుండటం గమనార్హం. నిబంధనలు కేవలం చిరువ్యాపారులకే తప్ప, కార్పొరేటర్‌ అయిన తనకు వర్తించవన్నట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గతంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్‌ మాల్‌కు గ్రీన్‌జోన్‌ మీదుగా ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటేనే అభ్యంతరం తెలిపి ఆ నిర్మాణాలను ఆపేసింది జీవీఎంసీ. ఇప్పుడు ఆ కార్పొరేటర్‌ గ్రీన్‌ బెల్ట్‌లో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించగా, ఈ నెల 28న జరగనున్న చివరి సర్వసభ్య సమావేశం అజెండాలో 36వ అంశంగా చేర్చడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. తూర్పు జోన్‌ పరిధిలోని 22వ వార్డులో, జాతీయ రహదారి వెంబడి ఉన్న పీతలవానిపాలెం గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతంలో స్మార్ట్‌ వీధి వ్యాపార మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఈ నెల 28న జరగనున్న జీవీఎంసీ చివరి సర్వసభ్య సమావేశ అజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇందుకుగాను రూ.1,94,60,000 అంచనా వ్యయంతో ప్రతిపాదిత స్థలంలో కంటైనర్‌ బేస్డ్‌ ప్లాట్‌ఫారం నిర్మాణం, కర్బ్‌ వాల్స్‌, పాదచారుల మార్గాలు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్‌ సదుపాయాల కల్పన వంటి అంశాలను అజెండాలో చేర్చారు. నిబంధనల పేరుతో వందలాది చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బతీసిన కార్పొరేటర్‌.. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్‌జోన్‌లో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, ప్రజా ప్రతినిధులకు మరో న్యాయమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

28న చివరి కౌన్సిల్‌ సమావేశం

జీవీఎంసీ ఐదేళ్ల పాలనా కాలంలో నాలుగేళ్ల పాటు వైఎస్సార్‌ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌ హోదాలో కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుత పాలకవర్గంలో మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ చివరి సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మొత్తం 37 అజెండాలను చేర్చారు. వీటిలో పలు సర్వీస్‌ అంశాలు, వీధి దీపాల నిర్వహణ, అభివృద్ధి పనులపై సభ్యులు చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement