సబ్బవరం: కుటుంబానికి అండగా నిలుస్తూ, కూరగాయలు అమ్ముకునేందుకు బయలుదేరిన ఒక మహిళా రైతు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సబ్బవరం మండలంలో శుక్రవారం చోటుచేసుకోగా.. సంతపాలెంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం సంతపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు నంబారు ఈశ్వరమ్మ(38) శుక్రవారం తన సోదరుడు సన్నిబాబు నడుపుతున్న ఆటోలో కూరగాయలు తీసుకుని సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెం బజార్‌కు బయలుదేరారు. గుల్లేపల్లి మీదుగా అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించారు. అదే సమయంలో రాయపూర్ ఎక్స్‌ప్రెస్ హైవే బ్రిడ్జి వద్ద పెందుర్తి వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక బొలెరో వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న ఈశ్వరమ్మ రెండు కాళ్లకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఆటో నడుపుతున్న సన్నిబాబు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ఈశ్వరమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సన్నిబాబు చికిత్స పొందుతున్నాడు. ఈశ్వరమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు సీఐ జి.రామచంద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పూట దట్టంగా కురిసిన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈశ్వరమ్మకు వివాహమైన కుమార్తె, ఇంటర్, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తూ
అనంతలోకాలకు..


