పదింతల గందరగోళం | - | Sakshi
Sakshi News home page

పదింతల గందరగోళం

Mar 5 2026 7:44 AM | Updated on Mar 5 2026 7:44 AM

● పరీక్షల నిర్వహణ తీరుపై అయోమయం ● ఇన్విజిలేటర్ల నియామకంలో అస్తవ్యస్తం ● విద్యాశాఖపై ఉపాధ్యాయుల అసంతృప్తి

ఆరిలోవ: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ తీరు ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేషన్‌, నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది. అయితే, ఈసారి ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందంటూ ఉపాధ్యాయ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది.

మారిన నియామక ప్రక్రియ

గత విద్యా సంవత్సరం వరకు జిల్లా విద్యాశాఖ అధికారులే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసేవారు. కానీ, ఈ ఏడాది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ నేరుగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ మార్పు ఉపాధ్యాయులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉపాధ్యాయులకు వరస నిర్ణయాలు నిరాశ కలిగిస్తున్నాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు పరీక్షల నిర్వహణలోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.

నేరుగా ఉత్తర్వులు

కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్ల ఎంపిక జరిగింది. వారికి నేరుగా ఆర్డర్‌ కాపీలు పంపడంతో జిల్లా అధికారులకు సైతం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రతి హైస్కూల్‌, యూపీ స్కూల్‌ నుంచి ఒకరు లేదా ఇద్దరిని ఎంపిక చేసేవారు. అవసరమైతే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను కూడా తీసుకునేవారు. దీని వల్ల పాఠశాలల్లో మిగిలిన ఉపాధ్యాయులతో తరగతులు సజావుగా సాగేవి. కానీ, ప్రస్తుతం ఒకే పాఠశాల నుంచి ఐదారుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. కొన్ని పాఠశాలల నుంచి అసలు ఎవరినీ తీసుకోలేదు. దీని వల్ల ఐదారుగురు ఉపాధ్యాయులు పరీక్ష విధులకు వెళ్లే పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బోధన పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 133 కేంద్రాలు

ఈ ఏడాది జిల్లాలో 30,633 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక సీఎస్‌, ఒక డీవోతో పాటు సుమారు 1,850 మంది సిబ్బందిని కేటాయించారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు వారిని నియమించాల్సి ఉండగా, 58 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారినే ఎక్కువగా ఎంపిక చేయడం గమనార్హం. పాత పద్ధతిలోనే నియామకాలు జరిపి ఉంటే పాఠశాలల నిర్వహణకు ఇబ్బంది ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement