ముగిసిన బాడీబిల్డింగ్ పోటీలు చాంపియన్ ఆఫ్ చాంపియన్స్‌గా కన్నూరు క్రీడాకారుడు ఓవరాల్ చాంపియన్స్‌గా మంగళూరు, కన్నూరు వర్సిటీలు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో కన్నూరు యూనివర్సిటీకి చెందిన ఎన్.మను కృష్ణ చాంపియన్ ఆఫ్ ది చాంపియన్‌గా నిలిచారు. ఏయూ మాజీ ఉపకులపతి, సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు, ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ సంయుక్తంగా మను కృష్ణకు ట్రోఫీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం, సానుకూల దృక్పథం కలిగి ఉండటం ఎంతో ప్రధానమని పేర్కొన్నారు. ఏయూ వీసీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ క్రీడా వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఏయూ క్రీడా సంచాలకుడు ఆచార్య ఎన్. విజయ్ మోహన్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల వేళ ఈ పోటీల నిర్వహణకు సహకరించిన ఏఐయూకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. విశ్వవిద్యాలయాలకు అందించే ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్ విభాగం ప్రథమ స్థానంలో సంయుక్తంగా మంగళూరు విశ్వవిద్యాలయం, కన్నూరు యూనివర్సిటీలు నిలిచాయి. తేజ్ బహదూర్ సింగ్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం, సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయం తృతీయ స్థానం సాధించాయి. విజేతలకు అతిథులు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో ఏఐయూ అబ్జర్వర్ డాక్టర్ కౌకబ్ అజీమ్, ఏయూ క్రీడా విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, విశ్రాంత బాడీబిల్డింగ్ కోచ్ డాక్టర్ ఆర్.వి.ఎన్. రత్నాకర్, బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె.గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.


