● పరిశీలన పరిహాసం
మహారాణిపేట : గత ప్రభుత్వ హయాంలో పేద రైతుల భూములకు లభించిన ’ఫ్రీ హోల్డ్’ (యాజమాన్య హక్కులు) భాగ్యంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ముఖ్యంగా విశాఖ జిల్లా పరిధిలోని వందలాది ఎకరాల భూములకు సంబంధించి విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, రైతులను గందరగోళంలోకి నెట్టివేస్తోంది. గత ప్రభుత్వం 2002 కంటే ముందు మంజూరు చేసిన డి.పట్టా భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీహోల్డ్ భూములపై ఆరోపణలు చేస్తూ విచారణ ఆదేశించింది. అనంతరం అన్ని ప్రక్రియలను నిలిపివేసి, దాదాపు 20 నెలలుగా ‘పరిశీలన’ పేరుతో నిర్ణయం వాయిదా వేస్తోంది.
అక్రమాలు లేవు–
డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నివేదిక
ఈ భూములపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ఆరోపణలు చేశారు. పేదల భూముల్లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీహోల్డ్ ప్రక్రియను నిలిపివేసి, డిప్యూటీ కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా స్వయంగా భూములను పరిశీలించారు. అయితే ఫ్రీహోల్డ్ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ తేల్చినట్టు సమాచారం. గ్రామాల వారీగా పరిశీలన చేసిన కమిటీకి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలుస్తోంది. భూముల రికార్డులు, యజమానులతో ప్రత్యక్షంగా మాట్లాడి నివేదిక సిద్ధం చేసిన కమిటీ, ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. విచారణకు వెళ్లిన అధికారులకు ముందుగా అందిన సమాచారం కంటే, గ్రామాల్లో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి భిన్నంగా కనిపించిందని వర్గాలు చెబుతున్నాయి.
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..
రైతుల్లో గందరగోళం
ప్రస్తుతం ఫ్రీహోల్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్లతో మళ్లీ పరిశీలనలు చేయించినప్పటికీ, చట్టబద్ధతపై తుది నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసైన్డ్‌దారుడు మరణిస్తే వారసులు మ్యూటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. భూమి ఉన్నా హక్కుల స్పష్టత లేక రైతులు ఆందోళనలో ఉన్నారు. అవసరానికి భూమిని అమ్ముకోలేక, అటు యాజమాన్య హక్కులు అనుభవించలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
పూర్తి హక్కులు కల్పించాలి
అధికారులు అంతా సక్రమమేనని నివేదికలు ఇచ్చినా, ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఈ ఫైళ్లను పక్కన పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా కాలయాపన స్వస్తి చెప్పి, పేద రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
జిల్లాలో 609
ఎకరాలకు ఫ్రీహోల్డ్
సంబంధిత జీవో ప్రకారం జిల్లాలో మొత్తం 609 ఎకరాలకు ఫ్రీహోల్డ్ మంజూరు చేశారు. వాటిలో 190 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.
మండలం భూమి విస్తీర్ణం (ఎకరాలు)
ఆనందపురం 407.77 ఎకరాలు
పద్మనాభం 129.60 ఎకరాలు
పెందుర్తి 20.04 ఎకరాలు
భీమిలి 52.51 ఎకరాలు
పేదల భూముల విషయంలో
కూటమి సర్కారు తాత్సారం
గత ప్రభుత్వ హయాంలో
‘ఫ్రీ హోల్డ్’ సక్రమమే అని తేల్చిన కమిటీలు
ఇప్పటికీ యాజమాన్య హక్కులు కల్పనపై
తేల్చని చంద్రబాబు ప్రభుత్వం
పరిశీలన పేరుతో 20 నెలలుగా సాగదీత


