అనుమానమే ప్రాణం తీసింది
ఆరిలోవ: ఆరిలోవ పరిధిలో మంగళవారం జరిగిన గృహిణి హత్య క్షణికావేశంలో జరిగినదేనని ద్వారకా ఏసీపీ ఎ.నరసింహమూర్తి తెలిపారు. బాలాజీనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో బి.దేముడు తన భార్య దుర్గ (33)ను మంగళవారం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెల్లడించారు. దేముడు, దుర్గలది మేనరికం వివాహం. దేముడు తన మేనత్త కుమార్తె అయిన దుర్గను పెళ్లి చేసుకోగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ సిరిపురం వద్ద గల ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. అయితే, దుర్గ తరచూ ఎవరితోనో ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడుతోందన్న కారణంతో దేముడు ఆమైపె అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కూడా గొడవ జరగడంతో, దేముడు క్షణికావేశంలో దుర్గ మెడకు చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. హత్య జరిగిన అనంతరం స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకోవడంతో భయపడిన దేముడు, ఇంట్లోని ఫ్రిజ్ వెనుక దాక్కున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా, తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనుమానం, క్షణికావేశం వల్లే ఈ ఘోరం జరిగిందని ఏసీపీ తెలిపారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలని, అనుమానాలకు తావివ్వకూడదని ఆయన హితవు పలికారు. సమావేశంలో సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు కృష్ణ, వరహాలునాయుడు పాల్గొన్నారు.
ఏసీపీ నరసింహమూర్తి


