మన కోసం మనం సమయం కేటాయించుకోవాలి
విధుల్లో మహిళగా ఎక్కడా సాకులు వెతుక్కోవద్దు
విశాఖ పోర్టు తొలి మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్నీ అపరంజి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘నేను మహిళను కాబట్టి నాకు సహకారం లభించడం లేదని ఎప్పుడూ కారణంగా చూపకూడదు. మహిళలుగా మన కోసం మనం సమయం కేటాయించుకోవాలి. మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా కూడా మన సొంతకాళ్ల మీద మనం నిలబడాలి. మహిళను కాబట్టి నాకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనో, మహిళను కాబట్టి నాకు అవకాశాలు రావడం లేదనో ఎప్పుడూ చెప్పకూడదు. బీ స్ట్రాంగ్. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి’ అని విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్నీ అపరంజి పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోర్టు చరిత్రలో మొదటిసారిగా మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె 2011 అసోం–మేఘాలయ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. ఇప్పటివరకు నిర్వర్తించిన బాధ్యతల్లో తాను మహిళను కాబట్టి ఈ పనిచేయలేనని ఎక్కడా సాకులు చెప్పలేదని ఆమె తెలిపారు. విద్యాభ్యాసం మొత్తం విశాఖలో సాగినా.. తనకు అసోం కేడర్‌లో ఐఏఎస్‌గా పోస్టింగ్ వచ్చినప్పుడు కుటుంబం మొత్తం భయపడిందని, తాను మాత్రం దానిని సవాలుగా తీసుకుని బాధ్యతలు నిర్వర్తించానని చెప్పుకొచ్చారు. విశాఖ పోర్టులో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని, ఇక్కడ నేర్చుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
విశాఖలో విద్యాభ్యాసం
‘నా విద్యాభ్యాసం మొత్తం విశాఖలోనే సాగింది. ఇక్కడే టింపనీ స్కూల్లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి పత్రికలు చదవడం అలవాటు. వివిధ రకాల మ్యాగజైన్లు కూడా ఇంటికి వచ్చేవి. నాన్న వాటిని చదివించేవారు. అదే నాలో ఐఏఎస్ కావాలనే కోరికకు పునాది వేసింది. మా నాన్న టీచర్. ఆయన సింగిల్ టీచర్‌గా పోర్టు ఆసుపత్రి పక్కనే పోర్టు పాఠశాలను ప్రారంభించారు. మా నాన్న హయాంలో ప్రారంభమైన పోర్టు స్కూల్‌కు చెందిన నేను, నేడు అదే విశాఖ పోర్టుకు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉంది. పోర్టు అనేది పూర్తిగా సాంకేతికతతో కూడిన వ్యవస్థ. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. మహిళలు మల్టీ టాస్కర్లు. మహిళలు ఆఫీసులో సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే, ఇంట్లో కూడా సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నా విధుల్లో నేను ఎప్పుడూ సాకులు వెతుక్కోలేదు.
అల్లర్ల సమయంలోనూ అదరకుండా.!
వైజాగ్‌లో పుట్టి పెరిగిన నాకు అసోం కేడర్‌లో పోస్టింగ్ దక్కింది. అందుకే మొదట్లో మా కుటుంబ సభ్యులు ఎంతో భయపడ్డారు. కానీ నేను దానిని సవాలుగా తీసుకున్నాను. అసోంలో మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే సంప్రదాయం ఉంది. అయితే అక్కడ అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతుంటాయి. ఏదో ఒక సమస్య మీద వందల సంఖ్యలో గుమిగూడి అల్లర్లకు పాల్పడేవారు. కలెక్టర్‌గా అక్కడ స్పాట్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. వారితో చర్చిస్తున్న సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. అటువంటి సమయంలో ప్రత్యే కంగా హెల్మెట్లు పెట్టుకుని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని మరీ అల్లర్లు జరిగే ప్రాంతంలో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ఫీల్డ్‌లో ఉండి పనిచేయడం వల్ల విధుల పట్ల ఎంతో సంతృప్తి కలిగేది. ధేమాజీ జిల్లాలో ఇటువంటి సంఘటనలు ప్రధానంగా జరిగేవి. ఆ సందర్భంలో వారు రాళ్లు తీసుకుని దాడులకు దిగేవారు. వారితో చర్చిస్తూనే అల్లర్లను నియంత్రించాల్సి వచ్చేది. అసోంలో వరదలు సంభవించడం సాధారణం. అక్కడి మొత్తం భూభాగంలో వరదలకు గురయ్యే ప్రాంతం 40 శాతం వరకూ ఉంటుంది. ఏటా రెండు, మూడు సార్లు సంభవించే వరదల వల్ల ప్రజాజీవనం ఎంతో ఇబ్బందులకు గురయ్యేది. కరోనా సమయంలో బంగ్లాలోని కింది గదిలోనే నేను ఒంటరిగా ఉండేదానిని. ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. బయట విధులు నిర్వర్తించి ఇంటికి వచ్చినప్పుడు, నా ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా ఎక్కడ సోకుతుందోననే భయంతో ఒంటరిగా ఉండేదానిని. ఆ ఏకాంత సమయంలోనే పెయింటింగ్ నేర్చుకున్నాను.


