పారిశ్రామిక ప్రాంతాల్లో సమగ్ర మౌలిక వసతులు
మహారాణిపేట: జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో సమగ్ర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆటోనగర్, మధురవాడ ఇండస్ట్రియల్ ఏరియా, ఐటీ పార్కుల్లో పనిచేస్తున్న కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ స్టాప్‌లను సమర్థంగా నిర్వహించి, ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గత అజెండా అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని సూచించారు. గాజువాక–ఆటోనగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) పనులను వేగవంతం చేసి, జూన్ తొలి వారంలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రోడ్లు–భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తాగునీటి సమస్యను ఐలా చైర్మన్ ప్రస్తావించగా, తక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. పీఎంఈజీపీ కింద మరిన్ని ప్రాజెక్టులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన అమలులో పురోగతిని సమీక్షిస్తూ అర్హులైన లబ్ధిదారులకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా నానో పార్క్, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు విషయంలో చురుగ్గా వ్యవహరించి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన ఇండస్ట్రియల్ పార్క్ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమయపాలనతో పూర్తి చేసి పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సింహాచలం, ఐలా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశాలు


