చేయి తడవనిదే.. పని జరగదు | - | Sakshi
Sakshi News home page

చేయి తడవనిదే.. పని జరగదు

Mar 4 2026 7:14 AM | Updated on Mar 4 2026 7:14 AM

అవినీతికి అడ్డాగా

తహసీల్దార్‌ కార్యాలయాలు

ముడుపులు చెల్లించకపోతే ఫైళ్లు గ ల్లంతు

ప్రతి పనికీ పదేపదే తిరగాల్సిందే!

కూటమి నేతలే దళారులు

మహారాణిపేట: రెవెన్యూ శాఖ అవినీతి ఆరోపణల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రధానంగా తహసీల్దార్‌ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. ప్రజా సేవే పరమావధిగా పనిచేయాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా.. ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల అండ లేకుండా అధికారుల్ని కలిస్తే పని జరిగే ప్రసక్తే లేదన్న ఆక్షేపణలున్నాయి.

ఇక్కడిది షరా‘మామూళ్లే’!

భూమి హక్కు పత్రం కావాలన్నా, చిన్న చిన్న తప్పుల సవరణ జరగాలన్నా, పలు ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా.. తహసీల్దార్‌ కార్యాలయంలో ముడుపులు తప్పనిసరి. అందినకాడికి దండుకోవడం రెవెన్యూ సిబ్బందికి క్యాష్‌తో పెట్టిన విద్యగా మారిందన్న ఆరోపణలున్నాయి. ముడుపులు ముట్టనిదే ఓ ఫైల్‌నూ వారు ముట్టుకోరంటే అతిశయోక్తి కాదు. నెలలు, ఏళ్ల తరబడి ఫైల్‌ పెండింగ్‌లో ఉన్నా.. అడిగే దిక్కుండదు. ఫైల్‌ నడిపేందుకు గడువు తేదీ అంటూ ఏదీ లేకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఏసీబీ అధికారులు దాడులు చేసి అడపాదడపా పట్టుకుంటున్నా.. రెవెన్యూ సిబ్బందిలో మార్పు మాత్రం రాని పరిస్థితి.

కూటమి నేతలే దళారీలు

రెవెన్యూశాఖలో వీఆర్వో నుంచి తహసీల్దార్‌ వరకు వారిని సంతోష పెట్టనిదే ఫైళ్లకు మోక్షం దక్కదని అందరికీ తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీలకు చెందిన చోటామోటా నాయకులే పైరవీలు చేసే దళారుల అవతారమెత్తారు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, సర్వే, సబ్‌ డివిజన్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, మ్యూటేషన్‌ ఇలా ఏ పని చేయాలన్నా.. వీరి ద్వారానే. పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌, భూసర్వే, ఆన్‌లైన్‌ వన్‌ బి, భూమి వివరాలు నమోదు, ధ్రువపత్రాల జారీ, ఇసుక రవాణా తదితర వ్యవహరాల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయాలన్నింటిలోనే ఇదే తంతు. కొన్ని కీలక తహాసీల్దార్‌ కార్యాలయాల్లో పోస్టింగుల కోసం కూటమి నాయకులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పుకుని మరీ కొలువుదీరారు. అందుకే ఆ మొత్తానికి పదింతలు దండుకునే పనిలో పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరోపణలునా.. ఫోకల్‌ పోస్టుల్లోనే

ఇటీవల కొంత మంది తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టి.. ఆరోపణలున్న సిబ్బందిని బదిలీ చేశారు. అయితే వారికి ఫోకల్‌ పోస్టులివ్వడం విశేషం. అవినీతి ఆరోపణలున్న వారిని సాధారణంగా నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేస్తారు. ఇక్కడ కూడా పైరవీలు, ముడుపులకు తలొగ్గి ఫోకల్‌ పోస్టులే కేటాయించారన్న ఆక్షేపణలున్నాయి.

వసూళ్లలో కొత్త దారులు

రెవెన్యూశాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు బల్ల కింద చేతివాటం ప్రదర్శించే వారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా అవినీతి నడుస్తోంది. ఫోన్‌ పే, గూగుల్‌ పే తదితర మార్గాల్లో తమ బినామీల నెంబర్లకు డబ్బులు పంపించుకుంటున్నారు. ఇటీవల కొంత మంది రైతులు మీ వీఆర్వోలు డబ్బులిస్తే తప్ప పనిచేయట్లేదని సంబంధిత తహసీల్దార్లకు చెప్పారు. అయితే వారు మాత్రం చాలా ధీమాగా.. వాళ్లచేత పనిచేయించుకోవాల్సింది మీరేనని, మేమేం చేయగలమని చెప్పడంతో అవాక్కవడం రైతుల వంతయింది. అడంగల్‌, 1బీ, మ్యుటేషన్‌, 22ఏ జాబితా నుంచి తొలగింపు తదితరాలకు భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారం ముదిరడం వల్లే రూరల్‌ తహసీల్దార్‌ హత్య ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే..! ఈ వ్యవహారాలన్నీ జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు.

వారసత్వ భూమిపై హక్కు మార్పునకు..

భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాసరావు(పేరు మార్చాం) తండ్రి మరణించాడు. వంశ పారంపర్యంగా వస్తున్న భూమిని తన పేరిట మార్చుకునేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. ఇది జరిగి చాలా రోజులైనా పురోగతి లేదు. తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీదారు సంప్రదించగా.. ఆర్‌ఐను కలవాలని సూచించారు. ఆయనతో మాట్లాడినా ఇప్పటి వరకు తండ్రి పేరిట ఉన్న భూమిని శ్రీనివాసరావు పేరిట మాత్రం మారలేదు.

యూఎల్‌సీ కోసం తిప్పలు

సీతమ్మధార కేఆర్‌ఎం కాలనీలో కాండ్రేగులు సీతారత్నం(పేరు మార్చాం)కు 30 సెంట్ల భూమి యూఎల్‌సీలో ఉంది. యూఎల్‌సీ సర్టిఫికెట్‌ తీసుకుంటేనే రిజిస్ట్రేషన్‌ అవుతుంది. దీంతో కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అది సీతమ్మధార కార్యాలయానికి చేరుకుంది. దాన్ని పరిశీలించి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది. అర్జీదారు సర్వేయర్‌ను కలిశారు. రెండు, మూడుసార్లు తిరిగిన తర్వాత స్థలం చూడాలన్నారు. ఆ తర్వాత కూడా సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు రోజుల తరబడి తిప్పుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement