విశాఖ లీగల్ : జిల్లా కోర్టులో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య కేంద్రంలో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు వివరించారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని పదో అదనపు జిల్లా కోర్టు వద్ద వైద్య కేంద్రంలో ఈసీజీ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ వైద్య సహాయం అందించడానికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య కేంద్రాన్ని విస్తృతపరిచి మరిన్ని సేవలను అందిస్తామన్నారు. ఈ కేంద్రాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా వినియోగించుకోవాలని సంఘం కార్యదర్శి లాలం పార్వతీనాయుడు అన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు.


