పింఛన్లకు చంద్ర గ్రహణం | - | Sakshi
Sakshi News home page

పింఛన్లకు చంద్ర గ్రహణం

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

పింఛన్లకు చంద్ర గ్రహణం

పింఛన్లకు చంద్ర గ్రహణం

మహారాణిపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా, కొత్త పింఛన్ల మంజూరు ఊసెత్తకపోవడంపై నిరుపేదల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని, దివ్యాంగులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఏటా రెండుసార్లు (జనవరి, జూలై) అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇచ్చిన దాఖలాలు లేకపోవడంతో వేలాది మంది అర్హులు ఆశగా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సోషల్‌ మీడియాలో కొత్త పింఛన్ల దరఖాస్తులపై తప్పుడు సమాచారం వైరల్‌ అవుతుండగా, సచివాలయాల్లో మాత్రం ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.

ప్రభుత్వ కుట్రపై ఆందోళనలు

మరోవైపు ఉన్న పింఛన్లను సైతం ఏదో ఒక సాకుతో తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఖజానాపై భారాన్ని తగ్గించుకునేందుకు లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ఆ పరీక్షలకు హాజరుకాని వారి పింఛన్లను నిలిపివేస్తున్నారు. జిల్లాలో సుమారు 1,579 మంది దివ్యాంగుల పింఛన్లకు ఎసరు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మంచం మీద ఉండే నిస్సహాయులకు సైతం నోటీసులు ఇచ్చి ఆసుపత్రుల చుట్టూ తిప్పడంపై వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

50 ఏళ్లకే పింఛన్‌ ప్రశ్నార్థకం

సూపర్‌–6 హామీల్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని చంద్రబాబు ప్రకటించినా, నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. సచివాలయాల్లో విచారిస్తే ‘ఆప్షన్‌ రాలేదు’ అనే సమాధానమే వినిపిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వేలాది ఫైళ్లు కార్యాలయాల్లో దుమ్ము పడుతున్నాయి. జిల్లాలో పింఛన్ల సంఖ్య నెలకు వందల సంఖ్యలో తగ్గుతూ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 2,107 పింఛన్లు తగ్గిపోయాయి. మార్చి ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, కొత్త వారిని చేర్చుకోకుండా పాత వారిని తొలగించడమే లక్ష్యంగా పాలన సాగుతోందని జనం మండిపడుతున్నారు.

కొత్తవి ఇవ్వరు..

ఉన్నవి ఉంచరు

ప్రస్తుతం జిల్లాలో

1,58,557 మంది

పింఛనుదారులు

పింఛన్‌దారులకు

చుక్కలు చూపిస్తున్న

చంద్రబాబు ప్రభుత్వం

సంవత్సరం నెల మొత్తం తొలగించిన

పింఛన్లు పింఛన్లు

2026 ఫిబ్రవరి 1,58,557 388

2026 జనవరి 1,58,945 441

2025 డిసెంబర్‌ 1,59,386 250

2025 అక్టోబర్‌ 1,59,950 250

2025 సెప్టెంబర్‌ 1,60,200 245

2025 ఆగస్టు 1,60,445 333

2025 జులై 1,60,778 200

మొత్తం తగ్గిన పింఛన్లు 2,107

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement