బీచ్ రోడ్ : విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి జె.సోమేశ్వరరావు సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ ఆదేశాల మేరకు ఈస్ట్‌పాయింట్ కాలనీలోని కేడీపీఎం హైస్కూల్‌లో శుక్రవారం జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 11 మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన 165 మంది విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని చెప్పారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజారావు, జ్యూరీ సభ్యులు డా. నాగేశ్వరరావు, డా. రాజేశ్వరరావు భవిష్యత్తులో సైన్స్ రంగంలో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు సుమతి భాయి మాట్లాడుతూ విద్యార్థుల అంతర్గత ప్రతిభను వెలికితీయడానికి పోటీతత్వం అవసరమని అన్నారు. ఈ విజ్ఞాన వారోత్సవాల్లో వక్తృత్వం, సెమినార్, పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, గైడ్ ఉపాధ్యాయులకు సోమేశ్వరరావు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.


