ఏయూలో వైజ్ఞానిక, క్రీడా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ఏయూలో వైజ్ఞానిక, క్రీడా సంబరాలు

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 4:07 AM

ఏయూలో వైజ్ఞానిక, క్రీడా సంబరాలు

ఏయూలో వైజ్ఞానిక, క్రీడా సంబరాలు

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, జాతీయ సైన్స్‌ డే పురస్కరించుకుని వర్సిటీలో వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్‌ తెలిపారు. గురువారం అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీలలో ‘శాసీ్త్రయ పరిశోధనల్లో పురోగతి’ అనే అంశంపై జాతీయ స్థాయి సింపోజియం జరగనుంది. ఈ సదస్సుకు ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ గౌహతి, ఐఐఎస్‌సీ బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి 9 మంది నిపుణులు హాజరవుతున్నారు. వీరిలో నలుగురు భట్నాగర్‌ అవార్డు గ్రహీతలు ఉండటం విశేషం. 27న బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభమయ్యే ఈ సదస్సులో నిపుణుల ప్రసంగాలు, లఘుచిత్ర ప్రదర్శనలు ఉంటాయి. 28న 3 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి, సర్‌ సి.వి.రామన్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.

మార్చి 2 నుంచి ‘బెస్ట్‌ ఫిజిక్‌’ పోటీలు

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మార్చి 2 నుంచి 4 వరకు ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ బెస్ట్‌ ఫిజిక్‌(పురుషుల) పోటీలను ఏయూ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 120 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 500 మంది బాడీ బిల్డర్లు ఈ పోటీలో తమ ప్రతిభను చాటనున్నారు. మార్చి 5న రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన అరబిందో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

విదేశీ విద్యార్థుల ఫెస్టివల్‌

ఏయూలో చదువుతున్న 55 దేశాలకు చెందిన 1,100 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా ఫుడ్‌ ఫెస్టివల్‌, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. విదేశీ విద్యార్థులు తమ దేశ సంస్కృతిని, ఆహార రుచులను ఇక్కడ పరిచయం చేస్తారు. అలాగే అనుబంధ కళాశాలల విద్యార్థుల కోసం సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ‘అన్వేషణ ’ప్రోగ్రామ్‌, పూర్వ వీసీలతో ప్రత్యేక ప్యానెల్‌ డిస్కషన్‌ వంటి వినూత్న కార్యక్రమాలకు నిర్వహిస్తున్నట్లు వీసీ తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను వారం రోజులు నిర్వహించే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశామని, త్వరలో ఆ వివరాలు తెలియజేస్తామని వివరించారు. సమావేశంలో రెక్టర్‌ ఆచార్య పి.కింగ్‌, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎం.వి.ఆర్‌ రాజు, క్రీడా విభాగం సంచాలకుడు ఆచార్య ఎన్‌.విజయ్‌ మోహన్‌, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య పాల్‌ డగ్లస్‌, ఆచార్య సంధ్య దీపిక, ఆచార్య శైలజ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి జాతీయ సింపోజియం

Advertisement
 
Advertisement
Advertisement