లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! | Big Relief for Travellers Lakshadweep Scraps Sponsor Police Clearance Rules | Sakshi
Sakshi News home page

లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు!

May 12 2026 7:43 AM | Updated on May 12 2026 7:52 AM

Big Relief for Travellers Lakshadweep Scraps Sponsor Police Clearance Rules

అందమైన పగడపు దీవులు.. అంతుచిక్కని నీలిరంగు సముద్ర తీరాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుత ప్రదేశం లక్షద్వీప్. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని కలలు కనేవారికి ఇప్పుడు ఒక శుభవార్త! ఇన్నాళ్లూ లక్షద్వీప్ వెళ్లాలంటే స్థానికుల స్పాన్సర్‌షిప్ కోసం వెతకడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం పడిగాపులు కాయడం లాంటి ఎన్నో కష్టాలు ఉండేవి. అయితే పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లక్షద్వీప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలు సడలిస్తూ, ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు ప్రయాణికులకు పూల దారిలా మారాయి. ఇంతకీ భద్రతలో ఏమాత్రం రాజీపడని లక్షద్వీప్‌ యంత్రాంగం పెట్టిన కొత్త రూల్స్, అమలు చేస్తున్న సడలింపులు ఏమిటి?

తొలగిపోయిన ప్రధాన అడ్డంకులు
తాజా మార్గదర్శకాల ప్రకారం, పర్యాటకులకు అతిపెద్ద అడ్డంకిగా మారిన ‘లోకల్ స్పాన్సర్’ (స్థానిక వ్యక్తి లేదా సంస్థ హామీ) నిబంధనను యంత్రాంగం పూర్తిగా ఎత్తివేసింది. దీనితో పాటుగా, ప్రయాణికులు తమ సొంత రాష్ట్రం నుంచి సమర్పించాల్సిన ‘పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)’ అవసరం ఇకపై ఉండదు. అయితే భద్రత విషయంలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, దరఖాస్తు చేసిన తర్వాత లక్షద్వీప్ పోలీసులే స్వయంగా అంతర్గత భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలు సజావుగా జరగడానికి, పర్యాటకులు తమ ప్రయాణ తేదీకి కనీసం 14 రోజుల ముందే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లక్షద్వీప్‌లో ఏ ఏ దీవులను సందర్శించాలనుకుంటున్నారు? ఏ ఏ తేదీల్లో అక్కడ ఉంటారనే వివరాలను అప్లికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాలి. పర్మిట్ దక్కని ఏ ఇతర దీవిలోనూ అడుగుపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లభించదు. ప్రయాణ మార్గంలో కవరత్తి లేదా అగత్తి దీవుల్లో గరిష్టంగా 12 గంటల పాటు మాత్రమే ట్రాన్సిట్ కోసం ఆగేందుకు అనుమతి ఉంటుంది.

పర్మిట్ వచ్చాకే బుకింగ్స్
ఎంట్రీ పర్మిట్ దరఖాస్తులను అధికారులు కేవలం మెరిట్ ఆధారంగా, అన్ని అర్హతలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు. అధికారికంగా ఎంట్రీ పర్మిట్ చేతికి వచ్చేలోపు ఎలాంటి విమాన లేదా హోటల్ బుకింగ్స్ చేసుకోవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పర్మిట్ రాకపోతే చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ల వల్ల భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఉండే పీక్ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఇకపోతే లక్షద్వీప్ స్థానికులు, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులకు మినహా.. భారతీయులతో సహా విదేశీయులందరికీ ఈ ఎంట్రీ పర్మిట్ తప్పనిసరి. పర్యాటకులు అన్ని దీవులకు వెళ్లలేరు. భారతీయ పౌరులు కేవలం ఐదు దీవులను (కవరత్తి, అగత్తి, బంగారం, కద్మత్, మినికాయ్) మాత్రమే సందర్శించేందుకు అనుమతి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కఠినమైన నియంత్రణలు కొనసాగుతాయి.

దరఖాస్తు ఎలా చేయాలి? 
పర్యాటకులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం ఎంచుకునేవారు అధికారిక ‘ఈ-పర్మిట్ (ePermit)’ పోర్టల్ లోకి వెళ్లి (https://epermit.utl.gov.in/pages/signup) అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ప్రయాణ తేదీలు, పర్సనల్ వివరాలు నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందితే ప్రయాణానికి సుమారు 15 రోజుల ముందు ఈ-మెయిల్ ద్వారా పర్మిట్ అందుతుంది. ఆఫ్‌లైన్ విధానం ద్వారా కూడా లక్షద్వీప్ యంత్రాంగ వెబ్‌సైట్ నుంచి ఫారాలు డౌన్‌లోడ్ చేసుకుని, కవరత్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చు. కానీ దీనికి ప్రాసెసింగ్ సమయం ఎక్కువ పడుతుంది. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్), ప్రయాణ టికెట్లు (ఫ్లైట్ లేదా పడవ), హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ (అవసరమైన చోట) డాక్యుమెంట్లను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ

Advertisement
 
Advertisement
Advertisement