తిరువనంతపురం: దేవుని సొంత దేశంగా పేరొందిన ‘కేరళ’ ఇప్పుడు డ్రగ్స్ మత్తులో తూగుతోంది. ఒకప్పుడు వీధుల్లో మాత్రమే గంజాయి కనిపించేది. ఇప్పుడైతే ఏకంగా ఫైవ్ స్టార్ హోటళ్లలో విలాసవంతమైన ‘ఎండీఎంఏ’ డ్రగ్ పార్టీలు దర్శనమిస్తున్నాయి. 590 కిలోమీటర్ల భారీ తీరప్రాంతం, మారుమూల రైల్వే నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ కేరళకు వెల్లువలా పోటెత్తుతున్నాయని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. వలస కార్మికులను పావులుగా వాడుకుంటూ, ఎలైట్ క్లాస్ ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ హైటెక్ డ్రగ్ మాఫియా వ్యవహారం ఇప్పుడు పోలీసులకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం డ్రగ్స్ రవాణా కేంద్రంగానే కాకుండా.. భారీ మాదకద్రవ్యాల వినియోగ మార్కెట్‌గా కేరళ ఎలా మారిందో దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.
గంజాయి నుంచి సింథటిక్ డ్రగ్స్ వైపు..
కేరళలో డ్రగ్స్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. గంజాయి కన్నా తక్కువ స్థలం ఆక్రమించే, దాచడానికి సులభంగా ఉండే హెరాయిన్, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ వంటి హై-ఎండ్ సింథటిక్ డ్రగ్స్ వైపు స్మగ్లర్లు మొగ్గుచూపుతున్నారు. హెరాయిన్‌కు వాసన లేకపోవడం, స్మగ్లర్లకు భారీగా లాభాలు రావడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా కొచ్చి వంటి నగరాల్లో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రైవేట్ పార్టీల ముసుగులో డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో కొచ్చిలో ఏకంగా 183.55 గ్రాముల ఎండీఎంఏ, 93.51 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్‌తో కెవిన్ బి. మాథ్యూ అనే వ్యక్తి పట్టుబడటం కలకలం రేపింది. ఆ తర్వాత మార్చి 28న కడవంత్రలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా కొకైన్, మెథాంఫెటమైన్ పట్టుబడటం ఈ హై-ప్రొఫైల్ నెట్‌వర్క్ తీవ్రతను కళ్లకుకట్టింది.
డ్రగ్ కొరియర్లుగా వలస కూలీలు..
ఎలైట్ పార్టీల సంగతి పక్కన పెడితే.. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌లో వలస కార్మికులను పావులుగా వాడుతుండటం దర్యాప్తు సంస్థలను మరింత కలవరపెడుతోంది. అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి కేరళకు పనుల కోసం వచ్చే అమాయక కూలీలను ఏజెంట్లు బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు పీకేస్తామని, సొంతూళ్లకు పంపేస్తామని భయపెట్టి, వారిని డ్రగ్స్ కొరియర్లుగా మారుస్తున్నారు. గత 18 నెలల కాలంలోనే డ్రగ్స్ కేసుల్లో దాదాపు 103 మంది వలస కార్మికులు అరెస్ట్ కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మాదకద్రవ్యాల పంపిణీ కోసం వీరు ‘డెడ్ డ్రాప్స్’ అనే సరికొత్త, అత్యంత పకడ్బందీ వ్యూహాన్ని వాడుతున్నారు. కొరియర్లు డ్రగ్స్ ఉన్న బ్యాగులను తమ వద్ద ఉంచుకోకుండా, రైల్వే స్టేషన్లలో ముందుగా మాట్లాడుకున్న రహస్య ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత స్థానిక డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాటిని తీసుకెళ్తారు. దీనివల్ల అసలు స్మగ్లర్ల మూలాలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.
అంతర్రాష్ట్ర ముఠాల వలయం..
ఈ డ్రగ్ మాఫియా మూలాలు కేవలం కేరళకే పరిమితం కాలేదు. జాతీయ, అంతర్జాతీయ ముఠాలతో వీరికి లోతైన సంబంధాలున్నాయి. కొచ్చిలోకి ప్రవేశిస్తున్న ఎండీఎంఏ, మెథాంఫెటమైన్‌లో ఎక్కువ భాగం బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుండగా.. హెరాయిన్ సరఫరా ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలతో ముడిపడి ఉంది. గోల్డెన్ క్రెసెంట్ (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్), గోల్డెన్ ట్రయాంగిల్ (మయన్మార్, థాయ్‌లాండ్) లాంటి అంతర్జాతీయ మార్గాల నుంచి వచ్చే కార్టెల్స్ కేరళను ఒక ప్రధాన లాంచ్‌ప్యాడ్‌గా ఎంచుకున్నాయి. ఇక్కడికి చేరిన డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. యువతలో పెరుగుతున్న ఆదాయం, గ్లోబల్ నైట్‌లైఫ్ సంస్కృతిపై ఆకర్షణ ఈ మార్కెట్ విస్తరణకు ఆజ్యం పోస్తున్నాయి. నిఘా పెంచినా, రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేసినా, ఈ భారీ డిమాండ్ ముందు భద్రతా సంస్థల ప్రయత్నాలు సరిపోవడం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..!


