Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..! | Watermelon Death Case Teen Girl who Died With Family Class 10 Exam with 70 | Sakshi
Sakshi News home page

Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..!

May 10 2026 1:52 PM | Updated on May 10 2026 4:01 PM

Watermelon Death Case Teen Girl who Died With Family Class 10 Exam with 70

ముంబై: మహానగరం ముంబైలో సంచలనం సృష్టించిన ‘పుచ్చకాయ మరణాల’ కేసులో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో సహా సహా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన 16 ఏళ్ల ఆయేషా డొకాడియా, తాజాగా విడుదలైన మహారాష్ట్ర ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.

మరణం తర్వాత వచ్చిన విజయం
ముంబైలోని పైధోనీ ప్రాంతానికి చెందిన ఆయేషా డొకాడియా ఫ్యాషన్ డిజైనింగ్‌ కెరీర్‌పై కలులుగనేది. అయితే విధి ఆ కలను కల్లలు చేసింది. మే 8న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 70 శాతం మార్కులు సాధించింది. అయితే ఈ వార్త వినడానికి ఆయేషా మాత్రం మన మధ్య లేదు. ఏప్రిల్ 26న తన తల్లిదండ్రులు,  సోదరితో కలిసి ఆమె మృతి చెందింది. పరీక్షల ఫలితాలు రావడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఈ ఘోరం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పుచ్చకాయలో విషపు ఛాయలు
ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు. కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు వారు తిన్న పుచ్చకాయ నమూనాలలో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే విష రసాయనాన్ని ల్యాబ్ నిపుణులు గుర్తించారు. సాధారణంగా ఎలుకల మందులో వాడే ఈ రసాయనం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి పుచ్చకాయ తిన్న వెంటనే కుటుంబం మొత్తానికి వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజే ఆ నలుగురు జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారు.

మిస్టరీగా మారిన మరణాలు
ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా పథకం ప్రకారం విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదికలను సర్ జేజే ఆసుపత్రి వైద్య బృందం క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను, బాధితుల శరీరంలో విషం ఏ విధంగా ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు వైద్య నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement