
కిలోమీటర్ ప్రయాణానికి అర్ధగంట పైమాటే
లక్డీకాపూల్: గ్రేటర్ నగరంలో శనివారం ట్రాఫిక్ రక్షా బంధన్‌లో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి సతమతమైంది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో నగరవాసులతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. రాఖీ పౌర్ణమి రద్దీ కారణంగా ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడగా.. వ్యక్తిగత వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నగర శివార్లలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఫలితంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుగా నిలిచి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయారు.
ఊహించని ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు మరీ ముఖ్యంగా రాఖీ కట్టేందుకు బయలుదేరిన మహిళలు అవస్థలకు గురయ్యారు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం రూట్ ఇరువైపులా, మియాపూర్ నుంచి లక్డీకాపూల్ రహదారి ఇరువైపుల, కొంపల్లి వైపు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో స్తంభించిపోయాయి. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. నగరంలో ఎక్కడ చూసినా బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది. ఊహించని పరిణామంతో నగర పోలీసులు సైతం ట్రాఫిక్‌ను చక్కదిద్దే క్రమంలో సతమతమయ్యారు.