
నాలాల సమస్యకు పరిష్కారం శూన్యం
ఇంజినీరింగ్ లోపాలే ప్రధాన కారణం
ప్రణాళికలు లేని అధికారులు, పాలకులు
బుట్టదాఖలైన కిర్లోస్కర్ కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం... ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోవాల్సిందే.. ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగినా.. రోడ్డు గుంత పడినా.. వాహనం బ్రేక్‌డౌన్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ జామే.. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇంజినీరింగ్ లోపాలే. రహదారులు, కూడళ్లను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్మించకపోవడం. ట్రాఫిక్ కానీ, నాలాల విషయంలో కానీ మన అధికారులు, పాలకులు ఇంజినీర్ల పాత్ర విస్మరించడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి.
నాటి నివేదికలే ఇప్పటికీ దిక్కు..
నిజానికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పూర్తిగా పోలీసులదే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ప్రధాన కూడళ్లలో సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధంగా వెళ్లేందుకు మాత్రమే వారు దోహదపడతారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం వంటివి అదనంగా చేస్తారు. ట్రాఫిక్ సజావుగా, సాఫీగా సాగిపోయేందుకు రోడ్లు, కూడళ్లలోని జంక్షన్లు, ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లను కలిపే యాక్సెస్ రోడ్లు వంటివి ప్రణాళికాబద్ధంగా రూపొందించకపోవడంతోనే నగరంలో ఈ సమస్యలంటున్నారు ట్రాఫిక్ నిపుణులు. నాలాల విషయంలో ఇంజినీరింగ్ ప్రముఖుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1920లో రూపొందించిన నివేదికలే ఇప్పటికీ పనికి వస్తున్నట్లే.. రోడ్ల విషయంలో అలాంటి ప్రణాళికలు లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని స్పష్టం చేస్తున్నారు.
లోపాలతోనే వేగానికి తూట్లు...
నగరంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. విపరీతంగా విస్తరిస్తున్న ప్రధాన రోడ్లు, వాటిని కలిపే యాక్సెస్ రోడ్లు, చిన్నా చితకా రోడ్లతో పాటు చిన్నచిన్న గల్లీలనూ లెక్కేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేదన్నది నిపుణులు చెబుతున్న వాస్తవం. అత్యంత ప్రధానమైన రోడ్లలోనూ నానాటికీ రద్దీ పెరిగిపోతోంది. వాటికి సమాంతర రోడ్ల అభివృద్ధి అనే ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ అనేక పద్మవ్యూహంలా మారిపోతోంది. వాస్తవానికి నగరంలోని ప్రధాన ఆరీ్టరియల్ రోడ్లు (ప్రధాన రహదారులు) అయిన పంజగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక తదితర రోడ్లన్నీ వాహనాలు కనీసం గరిష్టంగా 60 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న పెద్దరోడ్లే. కానీ కేవలం ఇంజినీరింగ్ ప్రమాణాల లోపాలతోనే ఇప్పుడీ రోడ్లన్నీ ట్రాఫిక్ వలయంలో చిక్కిపోతూ సరాసరిన గంటకు కనీసం 30 కిమీ వేగంతోనూ వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి.
కిర్లోస్కర్ కమిటీ నివేదికా బుట్టదాఖలే..
నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం–వరద తీవ్రత ప్రజలతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. దీంతో వరద నివారణ చర్యలు సిఫార్సు చేయడానికి 2003లో కిర్లోస్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అప్పట్లో ఉన్న ఎంసీహెచ్ పరిధిలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను 170 కిలోమిటర్ల మేర విస్తరణ తక్షణం చేపట్టాలని, అందుకు రూ.264 కోట్లు వ్యయం అవుతుందని తేలి్చంది. 2007లో నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పోరేషన్‌లో విలీనమై జీహెచ్‌ఎంసీ ఏర్పడింది. ఇలా 625 చ.కి.మీల్లో విస్తరించిన గ్రేటర్‌కు సమగ్ర మాస్టర్ ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల, మేజర్, మైనర్ వరద నీటి కాలువ ఆధునీకరణ కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరద నీటి సమస్య పరిష్కారానికి అప్పట్లోనే రూ. 6247 కోట్లు అవసరం అవుతాయని తేలి్చంది. ఈ నివేదికలు ప్రాథమిక స్థాయిలోనూ అమలు చేయకపోవడంతో
ఇబ్బందులు తప్పట్లేదు.
అన్నీ ఉన్నా అధ్యయనమేది?
రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక అవలంబించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో రోడ్డు నిర్మించాల్సి వస్తే దాని వల్ల ఎక్కువగా ఎవరి ప్రయోజనం... అంటే స్కూల్ జోనా? వాణిజ్య ప్రాంతమా? తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి. దానికి తగ్గట్టు మార్పుచేర్పులతో రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిటీలో మాత్రం ఆరీ్టరియల్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఇంటర్మీడియట్ రోడ్లు దేనికీ సరైన ప్రణాళిక, అధ్యయనం లేకుండానే నిర్మితమవుతాయి. అందుకే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.
ఆ ‘భుజం’కు ఊతమేది?
నగరంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, బస్సు వంటివి బ్రేక్ డౌన్ అయినా గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. నిజానికి ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ఒక్కోటి 2.5 మీటర్ల వెడల్పుతో కనీసం నాలుగు లైన్లుగా ఉండాలి. దీనితో పాటు ఆ రోడ్డుకు సాంకేతికంగా ‘షోల్డర్స్’ అని పిలిచే ఖాళీ ప్రదేశం ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా వాహనం పాడయితే అది మిగతా వాహనాలకు అవాంతరం కాకుండా ఉండేందుకు దాన్ని షోల్డర్స్‌లో నిలిపి వేస్తారు. కానీ మనదగ్గర ఇవి ఏ ప్రాంతంలోనూ మచ్చుకు కూడా కనిపించవు. ఫుట్‌పాత్‌లుగా పిలిచే కాలిబాటలపై ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటూ అనేకసార్లు హైకోర్టు, లోకాయుక్త వంటి వ్యవస్థలు హెచ్చరించాయి. రహదారికి పక్కన తప్పనిసరిగా కాలిబాటలు ఉండాలి. ఫలితంగా పాదచారులు వీటిని ఆశ్రయిస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. సిటీలో ప్రధాన రోడ్లతో పాటు యాక్సెస్ రోడ్లకూ ఉన్న ఫుట్‌పాత్‌లు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా జరగడానికి ఇంజినీరింగ్ లోపమే ప్రధాన కారణం.