
పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా
ఆవుపేడ, ఎర్రమన్ను, చెట్ల గింజలతో తయారీ
తెలంగాణ గోశాల ఫెడరేషన్ వినూత్న కార్యక్రమం
కాచిగూడ : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమ బంధానికి చిహ్నం రక్షాబంధనం.. దీనినే రాఖీ అని కూడా అంటారు. శ్రావణ పౌర్ణమిన జరుపుకునే ఈ పండుగ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ‘రాఖీ’ కట్టి, పది కాలాలపాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు.. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటానని చెప్పడమే ఈ పండుగ విశేషం.
అయితే గతంలో ఈ పండుగ పూర్తిగా పర్యావరణ హితంగా జరిగేది. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలు, ఇతర చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులతో రాఖీలను తయారు చేసేవారు. రాను రాను ఇది ఆధునిక పోకడల కారణంగా ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారుచేసేవాటిని వినియోగిస్తున్నారు. దీనికి భిన్నంగా పర్యావరణ హితమైన గోమయం, ఎర్రమన్ను, నేత దారం, చెట్ల గింజలతో రాఖీలను అందుబాటులోకి తీసుకొచ్చారు తెలంగాణ గోశాల ఫెడరేషన్ సభ్యులు.
ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని
రక్షణ బంధం..పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. పేడలో కూరగాయలు, పూల మొక్కలు, చెట్ల గింజలను చేర్చి తయారు చేస్తాం. పండుగ అనంతరం ఈ రాఖీలను ఇంటి పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇతర ఖాళీ స్థలాల్లో విసిరేస్తే, అవి మొలకెత్తి మానవాళికి ఉపయోగపడతాయి. వీటి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి. – మహేష్ కుమార్ అగర్వాల్, తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు
చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు