
రాఖీ సందర్భంగా భారీగా తరలివెళ్లిన ప్రయాణికులు
సిటీ బస్సులు కూడా ప్రత్యేక చార్జీలతో జిల్లాలకు తరలింపు
ఈ నెల 11 వరకు 50 శాతం అదనపు బాదుడే
సాక్షి, సిటీబ్యూరో: రక్షా బంధన్‌ను ఆర్టీసీ భారీగా సొమ్ము చేసుకుంది. రాఖీ సందర్భంగా సొంత ఊళ్లకు తరలివెళ్లిన ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడింది. కొంతకాలంగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలపైనే బస్సులను నడుపుతున్న ఆర్టీసీ అధికారులు శనివారం రాఖీ సందర్భంగా ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. ప్రత్యేక బస్సుల్లో ఈ నెల 11వ తేదీ వరకు 50 శాతం అదనపు చార్జీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ప్రత్యేక బస్సుల పేరిట..
కొంతకాలంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులను సైతం సాధారణ చార్జీలపైనే నడుపుతున్నారు. కానీ శనివారం ఉన్నపళంగా రాఖీ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు 2003 నాటి జీవో 16ను ఆర్టీసీ అధికారులు తెరపైకి తేవడం గమనార్హం. ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవో ప్రకారం ప్రత్యేక బస్సుల డీజిల్, నిర్వహణ ఖర్చుల కోసం టికెట్ ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల పేరిట ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ చార్జీలను పెంచారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. పైగా రాఖీ సందర్భంగా మహిళలే పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అయినప్పటికీ పురుష ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచినట్లు అధికారులు తెలిపారు.
అడ్డగోలు వసూళ్లు..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సిటీ బస్సులను కూడా అదనపు చార్జీలతో జిల్లాలకు నడిపారు. మరోవైపు మ్యాక్సీ క్యాబ్‌లు, ప్రైవేట్ కార్లు, ట్యాక్సీలు, టాటాఏస్‌లు, తదితర వాహనాల్లో సైతం ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లోనే చార్జీలు పెంచడంతో ప్రైవేట్ వాహనదారులు మరింత రెచి్చపోయి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు ఆర్టీసీ లగ్జరీ చార్జీ శనివారం రూ.300 నుంచి రూ.450కి పెరిగింది. ప్రైవేట్ వాహనాల్లో ఏకంగా రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేశారు. అన్ని రూట్లలోనూ ఇదే తరహాలో ప్రయాణికులపై దారిదోపిడీ కొనసాగింది.
భారీగా కిక్కిరిసి...
నగరంలోని జూబ్లీ, మహాత్మా గాం«దీ, దిల్‌సుఖ్‌నగర్ బస్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడాయి. ఎల్‌బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, బీఎన్‌రెడ్డినగర్ తదితర ప్రధాన కూడళ్లు సైతం ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులతో నిండిపోయాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. శనివారం మరో 30 వేల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అంచనా. ఆర్టీసీ బస్సుల్లో కాకుండా సొంత వాహనాల్లో, ప్రైవేట్ వాహనాల్లో, రైళ్లలోనూ నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
స్తంభించిన ట్రాఫిక్..
వరుస సెలవుల దృష్ట్యా కూడా ప్రయాణికుల పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ప్రయాణికులు, వాహనాల రద్దీతో రహదారులపైన ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ వైపు వనస్థలిపురం, హయత్‌నగర్ రూట్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వరంగల్ వైపు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు వెళ్లడానికే కనీసం 3 గంటల సమయం పట్టినట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ మార్గాల్లో శనివారం ఒక్కరోజే సుమారు 10 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లినట్లు అంచనా.
సిటీలో బస్సుల్లేవ్..
సిటీ బస్సులను చాలా వరకు జిల్లాలకు తరలించడంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లోనే పడిగాపులు కాశారు. రాఖీ సందర్భంగా నగరంలో ఉన్న తోబుట్టువులు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో క్యాబ్‌లు, ఆటోలు, తదితర వాహనాలను ఆశ్రయించారు. మెట్రో రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రాయదుర్గం, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఉప్పల్ ,నాగోల్ రూట్లో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రోలు కిక్కిరిశాయి. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్‌లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా నమోదైంది. మరోవైపు అనేక చోట్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.