ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా సంస్థ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలను రెట్టింపు చేసిందని, ప్రతి మూడు నెలలకోమారు ఆ చార్జీలను చెల్లిస్తోందని వెల్లడించారు. ఆదివారం ప్రజాభవన్‌లో ఆర్టీ సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణాశాఖ జేటీసీలు, ఎంజేపీ కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. సంస్థకు కొత్త బస్సులను సమకూర్చుతున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ, సంస్థ సొంతంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళా సాధికారతకు ఇది దోహదం చేస్తోందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు రూ.1,400 కోట్లు పేరుకుపోగా, తమ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని రూ.660 కోట్లకు తగ్గించామని, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఉచిత ప్రయాణాల కోసం ప్రయాణికులకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేక కార్డులు రూపొందించి పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి మహిళకు ఈ కార్డు చేరేలా చూడాలని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్నందున, తదనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాలను కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తున్నట్టు భట్టి వెల్లడించారు.
అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రెగ్యులర్ కండక్టర్ పోస్టుల భర్తీకి, చీఫ్ ఎకౌంట్ ఆఫీసర్ పోస్టులకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీకి సంబంధించి యూజర్ ఛార్జీల వసూలుకు అనుమతి ఇవ్వాలని కోరారు.రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం కొత్త వాహనాలు, పన్ను వసూళ్లకు టాబ్స్ మంజూరు చేయాలని కోరారు.


