ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లింపులో మతలబు... 2017 వేతన సవరణతో కొత్త జీతాలు అమలులోకి
కానీ పాత జీతాల ప్రకారం లెక్కగట్టి ప్రయోజనాలు చెల్లింపు
నష్టపోయిన రూ.150 కోట్ల కోసం రిటైర్డ్ ఉద్యోగుల ప్రదక్షిణలు
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల పాటు సంస్థ కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులను ఆర్టీసీ దగా చేసింది. లెక్క ప్రకారం చెల్లించకుండా పెద్ద మొత్తాన్ని ఎగ్గొట్టేసింది. ముందు అసలే ఇవ్వలేదు. చివరకు ‘సాక్షి’చొరవతో చెల్లింపుల కోసం బ్యాంకు నుంచి రుణం తెచ్చింది. కానీ లెక్కల్లో మతలబులు చేసి తక్కువ మొత్తాన్ని చెల్లించి చేతులు దులుపుకుంది.
ఆ మతలబు విలువ రూ.150 కోట్లు కాగా..ఇక అడగరు అనుకుందేమో ఎగ్గొట్టేసింది. ఇప్పుడు మళ్లీ రిటైర్డ్ ఉద్యోగులు బస్‌భవన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే ఆ డబ్బులు అందకుండానే వందల మంది చనిపోతుండటంతో కుటుంబసభ్యుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
‘అడియాసలు’పై ‘సాక్షి’ కథనం
ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపు విషయంలో దాదాపు దశాబ్దన్నరగా సమస్యలు నెలకొంటున్నాయి. అయితే రిటైర్ అయిన వారి విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఉంది. ఉద్యోగ విరమణ పొందిన రోజు వారిని సత్కరించి కొన్ని ఆర్థిక లబ్ధి ప్రయోజనాలు అందించి సాగనంపటం ఆనవాయితీగా వస్తోంది. కానీ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటంతో గత కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీని పక్కన పెట్టింది.
ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా బెనిఫిట్స్ సకాలంలో చెల్లించటం లేదు. ఇదే విషయాన్ని పేర్కొంటూ గత జూలైలో ‘ఆర్టీసీలో అడియాసలు’శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఉద్యోగ విరమణ పొందిన వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులు, 2017 వేతన సవరణ తాలూకు బకాయిలు చెల్లించని తీరును అందులో ఎత్తిచూపింది. దాదాపు 16 వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదనను అందులో కళ్లకు కట్టింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం, వారికి చెల్లింపులు జరపాలని ఆర్టీసీని మౌఖికంగా ఆదేశించింది.
దీంతో సంస్థ బ్యాంకు నుంచి దాదాపు రూ.400 కోట్ల రుణాన్ని పొందింది. ఇందులోంచి ఉద్యోగ విరమణ పొందిన వారికి రూ.150 కోట్లు చెల్లించింది. మిగతా మొత్తాన్ని వేరువేరు అవసరాలకు వినియోగించుకుంది. ఇక్కడే మతలబు చోటు చేసుకుంది. ఆ రూ.150 కోట్లను ఉద్యోగ విరమణ పొందిన వారి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంటు బకాయిల కింద చెల్లించింది. ఇతర బకాయిలు లేవు అన్న తరహాలో వ్యవహరించింది. ఇక్కడే మతలబు చోటుచేసుకుంది.
పెరిగిన జీతాన్ని కాకుండా..
ఆర్టీసీలో 2017లో వేతన సవరణ జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల పేరుతో మధ్యంతర భృతి ప్రకటించి పెండింగులో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిట్‌మెంటును ప్రకటించి 2024 జూన్ నుంచి అమలులోకి తెచ్చింది. అయితే బకాయిలను 2017 ఏప్రిల్ నుంచి లెక్కగట్టి చెల్లించాల్సి ఉండగా.. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణతో పెరిగిన జీతాన్ని కాకుండా, పాత జీతాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టింది.
ఆ మేరకు రూ.150 కోట్లు చెల్లించింది. కానీ పెరిగిన జీతం ప్రకారం లెక్కగట్టి ఇస్తే ఆ బకాయిల మొత్తం మరింత పెరుగుతుంది. అంతమేర రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి కలిగేది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మొత్తాన్నే చెల్లించాలంటూ ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు ఆర్టీసీ బస్‌భవన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
వారికి చెల్లించేశారు..
వేతన సవరణతో 2024 జూన్ నుంచి జీతాలు పెరిగాయి. ఆ తర్వాత రిటైర్ అయిన వారికి కొత్త జీతాల ఆధారంగా గ్రాట్యుటీ లెక్కగట్టారు. అలా 2025 ఆగస్టు వరకు చెల్లించారు. కొన్ని నెలల వరకు లీవ్ ఎన్‌క్యాష్ మెంటు కూడా కొత్త జీతాల మేరకే లెక్కగట్టారు. ఆ సమయంలో కొందరు ఉన్నతాధికారులు కూడా రిటైర్ కావటంతో వారికి కూడా కొత్త జీతాల ప్రకారమే ఆ బెనిఫిట్స్ అందినట్టు సమాచారం. కానీ అంతకు 86 నెలల ముందు రిటైర్ అయిన వారికి మాత్రం పాత జీతాల మీద లెక్కగట్టడం గమనార్హం.


