అధికారులకు రవాణాశాఖ మంత్రి పొన్నం ఆదేశం
త్వరలో ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తా
ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి
ఆర్టీసీపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక.. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ సంస్థ క్రమంగా లాభాల బాటలో పడినప్పటికీ రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి నెలవారీగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ల ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలన్నారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లు, టిమ్ మిషన్‌ల ద్వారా ఇచ్చే టికెట్‌లపై అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని చెప్పారు.
ఇక ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు నిరంతరం శిక్షణతో పాటు ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలన్నారు. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్‌లు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని మంత్రి వెల్లడించారు.
గురువారం సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు తమ ఉచిత ప్రయాణాల కోసం 237 కోట్ల జీరో టికెట్లు ఉపయోగించుకున్నారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.7,980 కోట్లను ఆర్టీసీ కి చెల్లించిందని మంత్రి తెలిపారు. ఆరాంఘర్‌లో అధునాతన బస్సు టెరి్మనల్ నిర్మాణం కోసం ఆర్టీసీ, పోలీస్ శాఖల భూ బదలాయింపుపై చర్చించాలని సూచించారు.
నష్టాల్లోని డిపోలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ
ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిధాని తదితర డిపోలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున చార్జింగ్ స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
పీఎం ఈ –డ్రైవ్ కింద హైదరాబాద్‌కు కేటాయించిన మరో 2వేల ఎలక్ట్రిక్ బస్సులు విడతల వారీగా వస్తాయని తెలిపారు. ఇప్పటికే వెయ్యి ఆర్టీసీ డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటర్వ్యూలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ చివరిలోగా 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


