టికెట్ తీసుకోమన్నందుకు దాడి
ఆర్డీసీ సిబ్బందితో ప్రయాణికురాలి వాగ్వాదం
ఆపై బంధువులతో కలసి బస్సు నిలిపివేత
ఐ.పోలవరం: అమలాపురం–కాకినాడ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్‌పై ఓ ప్రయాణికురాలి బంధువులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అమలాపురంలోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర మురమళ్ల గ్రామానికి చెందిన ఓ యువతి బుధవారం రాత్రి బస్సు ఎక్కింది. ఆమె ఆధార్ కార్డు చూపకపోవడంతో కండక్టర్ టికెట్ తీసుకోమన్నారు. దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. ఆమె వ్యవహార శైలితో డ్రైవర్, కండక్టర్లు ఆమెను అనాతవరం సమీపంలో దింపి వెళ్లిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆగ్రహంతో మురమళ్ల వద్ద బస్సును ఆపి, బస్సు అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు సిబ్బంది, యువతి బంధువుల మధ్య జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


