గ్రేటర్ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల జోరు
ఈ నెలలో 50 కొత్త సర్వీసులు
మార్చి నాటికి మరో 225..
పీఎంఈ డ్రైవ్ కింద మరో 2,000 బస్సులు
100 శాతం ఆక్యుపెన్సీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీలో ఈవీలు (ఎలక్ట్రికల్ వాహనాలు) పరుగులు తీస్తున్నాయి. కాలుష్య రహిత, పర్యావరణహితమైన ప్రయాణ సదుపాయం కోసం నగరంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.
ఈ నెలలో కొత్తగా మరో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్డినరీతో పాటు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 225 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఈవీల సంఖ్య 540కి చేరనుంది.
మెరుగైన.. నాణ్యమైన సేవల కోసం..
ప్రస్తుతం నగరంలోని 25 డిపోల్లో నిత్యం 2,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రతిరోజూ 24 లక్షల మంది సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 16 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు. రెండేళ్ల క్రితం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది.
గతంలో కేవలం 65 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉండగా, మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 100 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాన్ని అందజేసేందుకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు.
పీఎం– ఈ డ్రైవ్ షురూ...
దేశంలోని మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ (పీఎం–ఈ డ్రైవ్)కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద హైదరాబాద్ ఆర్టీసీకి మరో 2000 బస్సులు రానున్నాయి. వీటి కోసం ఈ నెలలో టెండర్‌లను ఖరారు చేయనున్నారు.
వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ 2000 బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తారు. దీంతో 2027 నాటికి నగరంలో పూర్తిగా కాలుష్యరహిత, పర్యావరణ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరగనున్నాయి.
హెచ్‌ఎండీఏకు భారంగా డబుల్ డెక్కర్ బస్సులు..
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో నడుస్తున్న 6 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఆర్థికంగా పెనుభారంగా మారాయి. నిజాం కాలం నాటి డబుల్ డెక్కర్ బస్సులకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం 2023లో ఈ బస్సులను కొనుగోలు చేసింది. హెచ్‌ఎండీఏ ఒక్కో బస్సును రూ.2.16 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. కానీ.. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, లుంబిని పార్కు, సెక్రటేరియట్ రూట్‌లో మాత్రమే ఇవి సందర్శకులకు అలంకార ప్రాయంగా కనిపించడం గమనార్హం.


