ఆర్థిక ప్రయోజనాల బకాయిల కోసం ఏళ్లుగా రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపు
ఇప్పటివరకు 295 మంది మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల పాటు సంస్థ కోసం పనిచేసిన చిరుద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత అందే ఆర్థిక ప్రయోజనాలు జీవిత చరమాంకంలో ఆదుకుంటాయి. నెలనెలా అందే పింఛన్ డబ్బు కుటుంబాన్ని పోషిస్తుంది. ఇవేవీ అందని నిరుపేద చిరుద్యోగుల జీవితం అంధకారమే. రోజురోజు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ఆ వృద్ధ ప్రాణాలను కుంగదీస్తాయి.
బకాయిల కోసం అలుపెరగక చేసే ప్రయత్నం ఫలించనప్పుడు ఆందోళన మరింత పెరిగి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చివరకు ప్రాణాన్ని బలిగొంటుంది. ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతున్నదదే. బకాయిల కోసం పోరాడి, ఎదురుచూసి, అలిసిపోయి రిటైర్డ్ ఉద్యోగుల్లో 295 మంది చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకున్నారు.
బకాయిలు ఎందుకు...?
ఆర్టీసీలో 2017లో వేతన సవరణ జరగాల్సి ఉంది. కానీ, ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి ప్రభుత్వం 2024 జూన్ వరకు పెండింగ్‌లో ఉంచింది. 2024 జూన్ నుంచి వేతన సవరణ అమలులోకి వచ్చింది. 2017 ఏప్రిల్ నుంచి 2024 మే నెల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందినవారు 16 వేల మంది ఉన్నారు. వీరికి వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఇక గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంటును వేతన సవరణ తర్వాత పెరిగిన జీతం మీద కాకుండా ముందు జీతం మీద లెక్కగట్టడంతో రూ.300 కోట్ల వరకు బకాయిలేర్పడ్డాయి. వేతన సవరణ బకాయిలు రూ.300 కోట్ల వరకు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి వారివారి హోదాలను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.
వీటి కోసం ఆ రిటైర్డ్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయి, ఉద్యమబాట పట్టారు. కానీ, బకాయిలు అందటం లేదు. ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చాలా మందిలో తీవ్ర ఆందోళన నెలకొని గుండెపోటుకు గురవుతున్నారు. స్వల్ప కాలంలోనే ఏకంగా 295 మందివరకు ప్రాణాలు కోల్పోయారు.
ఇతని పేరు సురేందర్‌రాజు. ఆర్టీసీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇస్తూ ఈపీఎఫ్‌ఓకు రిటైర్‌మెంట్ ముందు రూ. 6 లక్షల చందా బకాయిలు చెల్లించారు. ఇందుకు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ఆ మేరకు ఆయనకు రూ.15 వేల పింఛన్ రావాలి. కానీ, అది పెండింగ్‌లో ఉండిపోవటంతో రూ.3 వేల నామమాత్రపు మొత్తమే అందుతోంది.

ఇక వేతన సవరణ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్‌లను వేతన సవరణతో పెరిగిన జీతం మీద కాకుండా పాత జీతం మీదే లెక్కగట్టారు. కొత్త జీతం మీద అందకపోవటంతో రూ.15 లక్షల వరకు బకాయి ఉండిపోయింది. పేద కుటుంబం కావటంతో అద్దె ఇంట్లోనే జీవనం... చేదోడు సంపాదన నామమాత్రమే కావటంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఇటీవల గుండెపోటు రావటంతో చనిపోయారు. ఇప్పుడు ఆయన కుటుంబం ఆగమైపోయింది.
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు మల్లయ్య. మహబూబాబాద్ డిపోలో కండక్టర్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అనారోగ్యంతో ఉన్న పెద్ద కుమారుడి అండ లేదు. చిన్న కుమారుడి చదువు పూర్తి కాకపోవటంతో సరైన ఉద్యోగం లేదు.

కుటుంబ పోషణ, ఖర్చులతో దాదాపు రూ.8 లక్షల వరకు అప్పు ఉంది. ఆర్టీసీ నుంచి రూ.10 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉండగా, వాటి కోసం కాళ్లరిగేలా తిరిగి ఫలితం లేకపోవటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత జూలైలో గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడాయన కుటుంబం ఆగమైపోయింది.


