
ఒక వ్యక్తికి పలువురు భార్యలున్న కథలు మనం చాలానే విని ఉంటాం..
ఈమధ్యే హిమాచల్ యువతి ఆచారం ప్రకారం అన్నదమ్ముల్ని మనువాడడం చూశాం
మహాభారతంలోని ‘‘పాంచాలి.. పంచ భర్తుక’’ అన్నట్టు కాదు కానీ...
ఒక మహిళకు ముగ్గురు భర్తలుండటం గురించి మీరెప్పుడైనా విన్నారా?
విని ఉండరు లెండి.
ఎందుకంటే ఆమె ఉండేది టాంజానియాలో మరి!. ఇక్కడో విశేషం ఏంటంటే.. ముగ్గురు భర్తలుండటం కాదు, వాళ్లందరి పోషణ బాధ్యత తనే తీసుకోవడం!. ఎంచక్కా.. ఎలాంటి కీచులాటలూ లేకుండా అందరూ ఒకే ఇంట్లో కాపురం కొనసాగిస్తూండటం!. ఆ విశేషాలేవో చూసేద్దాం రండి..
నెల్లి... టాంజానియా సరిహద్దులోని ఒకానొక పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం, కొనడం వృత్తి. బాగా సక్సెస్‌ఫుల్ కూడా. ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ.. ఓ కారు ప్రమాదంలో అతడు మరణించాడు. ఆ తరువాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ..
మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్తా ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కొన్నేళ్లు గడిచాయో లేదో.. ఆమె జీవితంలోకి ‘జిమ్మీ’ ఎంటరయ్యాడు. ఇతగాడు అప్పట్లో బాగా డిప్రెషన్‌లో ఉండేవాడట. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్‌తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లీ అతడిని రెండో మొగుడిగా స్వీకరించింది.
ఇది జరిగిన కొంత కాలానికి నెల్లీకి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అన్న బెంగ, దొరకదేమో అన్న అత్మనూన్యత భావం డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లీ అతడికి ధైర్యం చెప్పేది. ఆ తరువాత ఇతడిని మూడో భర్తగా స్వీకరించింది!
అందరూ ఒకే ఇంట్లో..
నెల్లీ, అమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకొక్కరికి ఒక్కో బెడ్‌రూమ్ కూడా ఉంది. ప్రస్తుత ముగ్గురు భర్తలూ నిరుద్యోగులు. దీంతో కార్ల డీలర్‌గా నెల్లీ సంపాదిస్తున్న దాంతోనే కుటుంబ నడుస్తోంది. ముగ్గురిలో ఎవరితో ఎంత సేపు గడపాలన్న విషయంలో నెల్లీ మాటే చెల్లుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లీ. ‘‘ముగ్గురు భర్తలూ నాకు సమానమే. అందరినీ ఒకేలా చూసుకుంటా. వాళ్లు కూడా ఎంతో అనోన్యంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా’’ అంటుంది నెల్లీ.
హసన్, జిమ్మీ, డానీలు కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఈ ఏర్పాటు బాగానే ఉందని చెబుతున్నారు. ‘‘మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం.. ఒక మహిళకు ఎక్కువమంది భర్తలుంటే ఎందుకుండాలి?’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు జిమ్మీ.

చిక్కులూ లేకపోలేదు..
నెల్లీ వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ.. బహుభర్తృత్వం(Polyandry) మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లీకి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని టాంజానియా లాయర్ ఒకరు చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లీ ఇరుగుపొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. అయితే ఒక్కటైతే స్పష్టం. మానవ సంబంధాలన్నవి అంత సులువుగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని!!
:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా